భారత క్రికెట్ కోచింగ్‌లో వరల్డ్ కప్ విజేత, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శకం మొదలైంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా గంభీర్‌ని బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని మంగళవారం అధికారింకగా వెల్లడించింది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీరే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ఆది నుంచే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఆ అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి.
ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ యాక్షన్ మొదలుకానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కోచ్ పదవిలో ఉంటాడు. అయితే సారథ్యం వహించినా, మెంటార్‌గా ఉన్నా ఆ జట్టులో గంభీర్ తన ప్రత్యేకత చూపిస్తాడు. ఐపీఎల్ 2012, 2014 సీజన్లలో గంభీర్ కేకేఆర్‌ను జట్టును గెలిపించాడు. 2024లో మెంటార్‌గా మరోసారి కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపాడు.

అంతేగాక సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా అవతారమెత్తించి సక్సెఫుల్ కెప్టెన్, మెంటార్‌గా గంభీర్ పేరు తెచ్చుకున్నాడు. అయితే అదే తరహాలో టీమిండియాకు కూడా కొత్త ఓపెనర్‌ను తీసుకువస్తాడని నెట్టింట్ల పోస్టులు వెల్లువెత్తున్నాయి. దాంతో పాటు విరాట్ కోహ్లి-గంభీర్‌తో డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుందో అని ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి. కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాను గంభీర్ బలవంతంగా ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయిస్తాడని సరదాగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
బంతితో పాటు బ్యాటుతో కూడా అప్పుడప్పుడు కుల్‌దీప్ యాదవ్, బుమ్రా సత్తాచాటుతుంటారు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో వీరిద్దరు పలు సందర్భాల్లో జట్టుకు విలువైన పరుగులు అందించారు. ఇక ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి- గౌతమ్ గంభీర్ గొడవపడిన విషయం తెలిసిందే. 2023 ఐపీఎల్ సీజన్‌లో వీరిద్దరు ఒకరిపైఒకరు దూసుకెళ్లారు. లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరూ గొడవకు దిగారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అని నెటిజన్లు ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు. అయితే 2024 ఐపీఎల్ సీజన్‌లో కోహ్లి-గంభీర్ ప్రేమగా పలకరించుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.