
లాహోర్: టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న అభిమానుల గురించి పత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కోహ్లీకి ఒక్క భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఎందుకంటే క్రికెట్‌పై విరాట్ కోహ్లీ వేసిన ముద్ర అలాంటింది. ప్రస్తుతం ఉన్న ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీని మించిన వారు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. అలాంటి విరాట్ కోహ్లీకి భారత్‌కు శత్రు దేశంగా భావించే పాకిస్థాన్‌లో కూడా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు కోహ్లీకి పాకిస్థాన్‌లో అభిమానులు ఉన్నారని వినడమే కానీ, ప్రత్యక్ష సాక్ష్యాలు అంటూ ఏవి కూడా బయటకి రాలేదు. అయితే తాజాగా కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ జరగుతుంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని టీమిండియా వెటరన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫోటోను పట్టుకుని కనిపించాడు. భారీగా ఉన్న విరాట్ కోహ్లీ పోస్టర్‌ను చూపిస్తూ అతను మైదానంలో సందడి చేస్తున్నాడు. చుట్టూ ఇతర జెండాలు, పాకిస్థాన్ క్రికెటర్ల ఫోటోలు ఉన్నప్పటికీ సదరు అభిమాని ఏ మాత్రం వెనకడుగు వేయకుండా విరాట్ కోహ్లీ ఫోటోతో సందడి చేశాడు. పలువురు మైదానంలోని ఈ సంఘనను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు అభిమానిని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అలాగే మరికొంత అభిమానులు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నామని పోస్టర్‌లు పెట్టారు. కొంతమంది అయితే విరాట్ కోహ్లీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడాలని కోరుతున్నారు. ఇంకొంత మంది కోహ్లీ లాహోర్‌లో పాకిస్థాన్‌పై ఆడాలని అంటున్నారు. అలాగే కోహ్లీ పాకిస్థాన్ రావాలని కోరుతూ పోస్టర్లతో మైదానంలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్లన్నీ నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.