బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.. జ్ఞాపకశక్తి కోల్పోయి వీధుల్లో మాజీ క్రికెటర్!
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి ఆందోళనకరమైన వార్తలు బయటకొచ్చాయి. ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించిన ఈ స్టార్ బ్యాటర్, ప్రస్తుతం తీవ్రమైన నరాల సంబంధిత సమస్యలతో పోరాడుతున్నారు. కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరించినట్లు వినోద్ కాంబ్లీ సన్నిహిత మిత్రుడు మార్కస్ కోటో తాజాగా వెల్లడించారు. గతంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు మెదడులోని ఆ గడ్డను తొలగించడం సాధ్యం కాదని వైద్యులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం వినోద్ కాంబ్లీ జ్ఞాపక శక్తి మందగించి కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. ఆయన మిత్రుడు కోటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వినోద్ కాంబ్లీ మద్యం అలవాటును పూర్తిగా మానుకున్నప్పటికీ.. సిగరెట్ వ్యసనం నుంచి బయటపడలేకపోతున్నారు. జ్ఞాపకశక్తి సరిగా లేకపోవడంతో తాను ధూమపానం చేయకూడదనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోతున్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు అటుగా వెళ్లే వ్యక్తులను లేదా ఆటో డ్రైవర్లను సిగరెట్ అడుగుతున్నారని.. వారు ఆయనను 'గ్రేట్ వినోద్ కాంబ్లీ' అని గుర్తుపట్టి గౌరవంతో సిగరెట్ ఇస్తున్నారని.. కానీ అది ఆయన మెదడుకు ఎంత ప్రమాదకరమో ఎవరూ ఊహించలేకపోతున్నారని మార్కస్ కోటో ఆవేదన వ్యక్తం చేశారు.

అయినప్పటికీ.. వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఇంట్లో ఫర్నిచర్ పట్టుకుని నడిచిన కాంబ్లీ.. ఇప్పుడు స్టిక్ సహాయంతో సొంతంగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కాళ్లలో బలం పెంచేందుకు త్వరలోనే ఫిజియోథెరపిస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. వినోద్ కాంబ్లీ చిన్ననాటి మిత్రుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెరవెనుక ఉండి నిరంతరం ఆర్థికంగా, వైద్యపరంగా సహాయం అందిస్తున్నారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు కూడా ఆయన చికిత్సలో భాగస్వాములయ్యారు.
మరో విశేషమేమిటంటే.. ఇన్ని ఆరోగ్య సమస్యల మధ్య కూడా వినోద్ కాంబ్లీ సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఇటీవల ఆయన ఓ ఐస్‌క్రీమ్ బ్రాండ్ కోసం అడ్వర్టైజ్మెంట్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన ప్రస్తుత శారీరక స్థితికి తగ్గట్టుగానే ఆ పాత్రను చాలా సహజంగా రూపొందించారు. మరోవైపు వినోద్ కాంబ్లీ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఆయన పాత క్రికెట్ మిత్రులు ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, తమ పేర్లు బయటకు రాకుండా రహస్యంగా విరాళాలు సేకరించి ఆయన చికిత్సకు, ఇంటి ఖర్చులకు పంపుతున్నారు. ఈ మాజీ క్రికెటర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications