ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలో ఓ నూతన అధ్యాయం మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఏకంగా రూ.16,500 కోట్ల రూపాయల భారీ ధరకు విక్రయించబడటం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్‌తో కూడిన కన్సార్టియం ఈ జట్టును దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన డీల్‌గా నిలిచిన ఆర్సీబీ విక్రయంపై ఆ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా ఎట్టకేలలకు స్పందించారు. భారీ ధరకు ఆర్సీబీ ఫ్రాంచైజీ అమ్ముడవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తూనే.. గతంలో తనను విమర్శించిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
అప్పుడు రూ.450 కోట్లు.. ఇప్పుడు రూ.16,500 కోట్లు
విజయ్ మాల్యా ఎక్స్(ట్విట్టర్) వేదికగా 2008 నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. "నేను 2008లో కేవలం రూ.450 కోట్లతో ఆర్సీబీని స్థాపించినప్పుడు చాలా మంది నా నిర్ణయాన్ని చూసి నవ్వారు. అది కేవలం నా ఆడంబరం కోసమే చేస్తున్నానని.. నా డబ్బు వృథా అవుతుందని విమర్శించారు. కానీ ఈ రోజు నా 450 కోట్ల పెట్టుబడి 37 రెట్లు పెరిగి 16,500 కోట్లకు చేరడం చూస్తుంటే.. నాడు నన్ను చూసి నవ్విన వారు ఇప్పడు ఏమంటారో?" అని విజయ్ మాల్యా ప్రశ్నించారు. ఇది ఓ వ్యాపారవేత్తగా తన దూరదృష్టికి నిదర్శనమని మాల్యా చెప్పుకొచ్చారు.

విరాట్ కోహ్లీ టాలెంట్ గురించి అప్పుడే మాకు తెలుసు
ఈ సుదీర్ఘ ప్రయాణంలో విరాట్ కోహ్లీ పాత్రను విజయ్ మాల్యా ప్రత్యేకంగా కొనియాడారు. అండర్-19 స్థాయిలో ఉన్నప్పుడే విరాట్ కోహ్లీలోని ప్రతిభను గుర్తించి ఆర్సీబీలోకి తీసుకున్నామని.. నేడు కోహ్లీ ప్రపంచ క్రికెట్ ఐకాన్‌గా ఎదగడం తనకెంతో గర్వకారణమని మాల్యా పేర్కొన్నారు. ఆర్సీబీ అనే బ్రాండ్‌ను నిర్మించడంలో విరాట్ కోహ్లీ చేసిన కృషి మరువలేనిదని.. తానూ ఎప్పుడూ ఆర్సీబీని తన సొంత బిడ్డలాగే భావిస్తానని విజయ్ మాల్యా భావోద్వేగంగా రాసుకొచ్చారు.
మారిన ఫ్రాంచైజీ యాజమాన్యం
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తన వ్యాపార వ్యూహంలో భాగంగా ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రేసులో ఎందరో దిగ్గజాలు పోటీ పడగా.. చివరికి కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని బృందం భారీ మొత్తంతో జట్టును దక్కించుకుంది. ఇదే రోజు రాజస్థాన్ రాయల్స్ కూడా రూ.15,300 కోట్లకు అమ్ముడవ్వడం గమనార్హం. కొత్త యాజమాన్యం కింద ఆర్సీబీ వరుసగా ఈ సారి కూడా కప్ కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.