ముంబై: గాయం కారణంగా గత కొంత కాలంగా టీమిండియాకు దూరమైన డాషింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఖరారైంది. తొడకు శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత పూర్తిస్థాయిలో కోలుకున్నాడు రోహిత్. గత కొన్నిరోజులుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రత్యేక శిక్షణ పొందాడు.
ఇకపై మ్యాచ్‌లు ఆడేందుకు పూర్తిగా సన్నద్ధమైన నేపథ్యంలో దేశవాళీ జట్టు ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నాడు. మార్చి 4న ఆంధ్రప్రదేశ్ జట్టుతో, 6వ తేదీన గోవాతో మ్యాచ్‌లో ముంబై తలపడనుంది.
'ఎట్టకేలకు ఫిట్‌నెస్ సాధించాను. విజయ్ హజారే ట్రోఫీలో ఈనెల 4,6 తేదీల్లో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. నేను కోలుకోవడానికి, తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు. నిమిషాలను లెక్కిస్తున్నా..' అని రోహిత్ ట్వీట్ చేశాడు.
కాగా, విజయ్ హజారే టోర్నీలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని,యువరాజ్‌సింగ్, శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్‌తో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు ఆడుతున్నారు. మూడు నెలల క్రితం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల మ్యాచ్‌లో రోహిత్ గాయపడ్డాడు. అప్పటి నుంచి ఏ అంతర్జాతీయ ఫార్మాట్‌లోనూ పాల్గొనలేదు.