
న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్, ముంబై కెప్టెన్ పృథ్వీ షా.. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. సూపర్ ఫామ్‌లో ఉన్న షా.. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, వసీమ్ జాఫర్, చేటేశ్వర్ పుజారాలకు సాధ్యం కానీ రికార్డును షా సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో 800 పరుగులకు పైగా నమోదు చేసిన తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.
విజయ్ హజారే ట్రోఫీ 2021 ఫైనల్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా (73; 39 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీ బాదాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో 800కుపైగా పరుగులు (827 పరుగులు) సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్ టోర్నీలో షా 8మ్యాచులలో 827 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2017-18 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ 723 పరుగుల రికార్డును తాజాగా షా బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్.. ఓపెనర్ మాధవ్ కౌశిక్ (156 బంతుల్లో 158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్ శతకానికి మరో ఓపెనర్ సమర్థ్ సింగ్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అక్షదీప్‌నాథ్ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ శతకాలు చేయడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
313 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పృథ్వీ షా (73: 39 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభానికి తోడు ఆదిత్య తారే (118 నాటౌట్: 107 బంతుల్లో 18ఫోర్లు) శతకంతో చెలరేగాడు. శివమ్ దూబే (42), శామ్స్ ములానీ (36) ఆకట్టుకున్నారు. ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో యూపీ బౌలర్లు విఫలమయ్యారు. ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకుంది. 16 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన యూపీకి నిరాశే మిగిలింది.