న్యూఢిల్లీ: ఆసియా టోర్నీ వరకు విరామం లభించడంతో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో గడుపుతున్నాడు. శుక్రవారం విరాట్ తన కుటుంబంతోపాటు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సందర్శించాడు. ఆ తర్వాత కోహ్లీ తన తల్లి, సోదరి, మేనల్లుడితో వాఘా బోర్డర్ సందర్శించాడు.
'ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుట్నించో ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది' అని కోహ్లీ చెప్పాడు. తన పర్యటనలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలలో పోస్ట్ చేశాడు.
కాగా, ఇటీవలే విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌లను అధిగమించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తన ఫాం కొనసాగించిన విరాట్ కోహ్లీ వేగవంతమైన 7వేల పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచులో మూడు వరుస అర్థ శతకాలను సాధించాడు.
టీమిండియా డైరెక్టర్ రవి శాస్త్రి రెండ్రోజుల క్రితం కోహ్లీ ఆటపై మాట్లాడుతూ.. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ ఆటను తలపిస్తోందని అన్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ తన సత్తాను చాటుతున్నాడని చెప్పాడు.