హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేశాడు. అందులో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవాతో సరదాగా కాసేపు ముచ్చటించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్, ఆసీస్ జట్ల మధ్య శనివారం రాంచీ వేదికగా టీ20 జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా రాంచీలోని ధోని ఇంటిని సందర్శించింది. ఈ సందర్భంగా ధోని కుమార్తె జీవాతో ఆటగాళ్లంతా సరదాగా గడిపారు. చిన్నపిల్లలంటే విపరీతంగా ఇష్టపడే కోహ్లీ, జీవాతో మరింత ఎక్కువసేపు ఆడుకుంటూ ముచ్చటించారు.
జీవాని పలకిరిస్తూ తీసిన వీడియోను కోహ్లీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 'మేము అందరం జీవాను కలిశాం. స్వచ్ఛమైన అమాయకత్వం గల జీవా ఆశీర్వాదం తీసుకున్నామని' కోహ్లీ తన ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేశాడు.
వీడియోలో ఏముందంటే?
కోహ్లీ జీవాను మీ ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న ధోనీ.. ఆరు ఉన్నాయి అని చెప్పు అని జీవాకు చెప్పాడు. ఆరు ఎక్కడ ఉన్నాయి.. అని మరోసారి ప్రశ్నించాడు. ఇంతలో జీవా మియావ్..మియావ్..అనడంతో కోహ్లీ కూడా ఆ చిన్నారిని అనుకరిస్తూపిల్లిలా మ్యావ్ అని అరిచాడు.
మ్యావ్ అని ఎవరు అన్నారు అని జీవా కోహ్లీని పదే పదే అడగడంతో అక్కడ నవ్వులు పూశాయి. గతంలో కూడా ఇలానే జీవాతో సెల్ఫీ దిగిన ఫోటోను కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా రెండో మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు గౌహతికి చేరుకున్నాయి. ఇరు జట్ల మధ్య మంగళవారం రెండో టీ20 జరగనుంది.