కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లు సరదాగా కలిసి నవ్వుకున్నారు. ఐపీఎల్ 6 సీజన్‌లో వీరు ఇరువురు ఫీల్డ్ పైనే మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు గంభీర్ జట్టులోకి రెండేళ్ల తర్వాత రావడం, కోహ్లీ కెప్టెన్‌గా ఉండటంపై అందరిలోని ఆసక్తిని రేపింది.
వీరిద్దరు మైదానంలో పరుష పదాలతో దూషించుకుని గత మూడేళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కటయ్యారు. 2013లో ఐపీఎల్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా కోహ్లి, గంభీర్ గొడవ పడ్డారు. అప్పటి నుంచి ఎక్కడ ఎదురుపడినా మాట్లాడుకోవడం అభిమానులు చూడలేదు.
అయితే తాజాగా భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటంతో న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు గౌతమ్ గంభీర్‌కి అవకాశం కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. రెండో టెస్టుకి ఆతిథ్యమివ్వనున్న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు గురువారం ప్రాక్టీస్ చేస్తుండగా ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. కోహ్లి, గంభీర్ పక్కపక్కనే నిల్చొని చిరునవ్వులు చిందిస్తూ సెషన్‌లో హుషారుగా కనిపించారు.