హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసింది అంతర్జాతీయ మ్యాచ్ కోసం కాదు. గల్లీ క్రికెట్ కోసం. ఆతిత్య శ్రీలంకపై ఐదు వన్డేల సిరిస్‌ను వైట్ వాష్ చేసిన తర్వాత కోహ్లీసేన మంచి జోరు మీదుంది.
వన్డే సిరిస్ అనంతరం శ్రీలంకతో జరగబోయే ఏకైక టీ20కి మూడు రోజుల సమయం లభించడంతో విరాట్ కోహ్లీ సరదాగా గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించాడు. కొలంబో వీధుల్లో పిల్లలతో కలిసి కోహ్లీ క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోని సౌరభ్ మల్హోత్రా అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో పోస్టు చేసి లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడుతూ ఇదేమీ మరీ అంత చెత్త షాట్ కాదంటూ ఓ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో చూసిన వారికి కోహ్లీ లెఫ్టాండ్‌తోనూ అదరగొడతాడేమో అనిపిస్తుంది. గతంలో కూడా పలుమార్లు నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లీ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడాడు.
ఇక ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో వెయ్యి పరుగులు మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో చివరి వన్డేలో తన కెరీర్‌లో 30వ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(30)తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) సెంచరీలతో అందరి కంటే ముందున్నాడు. ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 6 (బుధవారం) జరగనున్న ఈ ఏకైక టీ20కి కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టెస్ట్, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు ఏకైక టీ20లోనూ విజయం సాధించాలని చూస్తోంది.