
హైదరాబాద్: స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌ల బాల్ టాంపరింగ్ వివాదం మరిచిపోక ముందే... అదే జట్టుకు చెందిన మరో ఆస్ట్రేలియా ఆటగాడు టాంపరింగ్ చేయడానికి యత్నించిన మరొక వీడియో వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తన షూ స్పైక్స్‌తో బంతిని నొక్కిపట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
మూడో టెస్టు తొలిరోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 53వ ఓవర్‌లో సఫారీ ఓపెనర్ డీన్ ఎల్గర్‌కు వేసిన బంతి డిఫెన్స్ ఆడడంతో తిరిగి అది కమిన్స్ దగ్గరికే వచ్చింది. దీంతో కమ్నిన్స్ షూస్‌తో ఆపడంతో పాటు తన ఎడమకాలి స్పైక్స్‌తో కొన్ని సెకన్లపాటు బలంగా నొక్కపట్టి ఉంచడం వీడియోలో కనిపించింది. ఈ ఉదంతాన్ని అప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.
అంపైర్లు కూడా బంతిని పరిశీలించి ఆటను కొనసాగించారు. కామెంటేటర్ గ్రేమ్ స్మిత్ మాత్రం 'ఉద్దేశపూర్వకంగా.. అనుకోకుండా చేసింది' అని వ్యంగ్యంగా అన్నాడు. ఈ వీడియోపై కమిన్స్ మాట్లాడుతూ అది అనుకోకుండా జరిగిన సంఘటన అని పేర్కొన్నాడు. బంతిని తొక్కడం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆ సమయంలో నేను వెంటనే అంపైర్ ఇల్లింగ్‌వర్త్‌ను చూశాను. ఆయన చిన్నగా నవ్వారు' అని కమిన్స్ అన్నాడు.
మూడో టెస్టు తొలిరోజు ఆటలో భాగంగా కమిన్స్ నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అయితే కమిన్స్ వ్యవహారాన్ని అంపైర్లు సీరియస్ తప్పిదంగా పరిగణించకపోవడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా, మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్ బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.