న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వార్ మొదలైంది. ఇన్నాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సురేష్ రైనా ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధింపబడిన నేపథ్యంలో ధోనీ కూడా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు సారథిగా కొనసాగుతున్నాడు.
ఇది ఇలా ఉంటే హైదరాబాద్ సన్‌రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్.. రైనాపై సరదాగా ట్వీట్లతో వార్నింగ్ ఇచ్చాడు. కొత్త జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీకి, రైనాకు మొదట 'ఆల్ ది బెస్ట్' చెప్పాడు.

ఆ తర్వాత 'ఎవరైతే ఈ సీజన్‌లో కొత్తగా టీమ్ కెప్టెన్‌గా సారథ్యం వహిస్తున్నారో వారు టఫ్ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి' అని రైనాను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశాడు.
రైనాకు ఆల్ ది బెస్ట్ చెప్పినట్లే చెప్పి... ఛాలెంజ్ చేసిన తీరు క్రీడల్లో ఉండాల్సిన ఆరోగ్యకరమైన పోటీతత్వానికి ధావన్ మాటలే నిదర్శనమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఏప్రిల్ 12న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.