హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి శునకాలంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఎప్పుడైనా విరామం లభిస్తే చాలు ధోని తన ఇంట్లో ఉన్న పెంపుడు శునకాలతో సరదాగా గడుపుతాడు. గతంలో ఓసారి పెంపుడు శునకాలకు క్యాచ్‌లు పట్టడం నేర్పిస్తున్న వీడియోను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు మధ్య దొరికిన విరామంలో భారత జట్టు ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఆటగాళ్లు ఎవరికి వారు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా రాంచీలోని తన ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు.

తాజాగా ధోని భార్య సాక్షి తన పెంపుడు శునకం సామ్‌తో ధోని ఆడుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ధోనీ ఎటు కదిలితే అటు సామ్ కూడా కదులుతూ అతడినే అనుసరిస్తోంది. చివర్లో ధోనీ.. సామ్‌ను దగ్గరకు తీసుకుని ప్రేమగా దాని తలపై నిమరడాన్ని మనం వీడియోలో చూడొచ్చు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ధోని ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్‌కు సిద్ధమవుతున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 రాంచీ వేదికగా శనివారం జరగనుంది. ఇప్పటికే ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌ను కోహ్లీసేన 4-1తో దక్కించుకున్న సంగతి తెలిసిందే.