హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభానికి ముందు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ధోని తన సహచర ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో ధోని.. అజ్యింకె రహానెతో కలసి డాన్స్ చేస్తుండగా.. పూణె జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వెనుక నిల్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియోను పోస్టు చేసిన 12 గంటల్లోనే 7.50 లక్షల వ్యూస్, 4400 కామెంట్లు వచ్చాయి.
ఇదే వీడియోని అజ్యింకె రహానె తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. 2008 ఐపీఎల్ ఆరంభమయ్యాక 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఐపీఎల్ నుంచి చెన్నై జట్టుపై నిషేధం విధించిన తర్వాత గత సీజన్‌లో పుణె కెప్టెన్‌గా ధోనీ నియమితుడయ్యాడు.
అయితే ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభానికి ముందు ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్ధానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉంటే కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా సాధారణ ఆటగాడిగా ధోని ఆడుతున్న తొలి ఐపీఎల్ ఇదే కావడం విశేషం.