
లండన్: వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019 వరల్డ్ కప్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా రూపోందించిన ఓ ప్రమోషనల్ వీడియో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోలో ఆండ్రూ ప్లింటాఫ్ 'వరల్డ్‌కప్ వచ్చేస్తోంది' అని హెడ్‌లైన్‌ను న్యూస్ పేపర్‌లో చూసి ఆనందంతో విజిల్ వేస్తూ.. కొంత మంది డ్యాన్సర్లు, అభిమానులతో గల్లీల్లో తిరుగుతూ పాటలు పాడుతూ కనిపిస్తారు. ఫ్లింటాఫ్‌తో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫిల్ టఫ్‌నెల్‌లను కూడా ఇక్కడ చూడొచ్చు.
'ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్' అంటూ ఫ్లింటాఫ్ పాట పాడుతుండగా వివిధ దేశాల జెండాలతో అభిమానులు, డ్యాన్లర్లు అతన్ని ఫాలో అవుతూ డ్యాన్స్ చేయడాన్ని మనం చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో మే 30 నుంచి జులై 14 వరకు జరగనుంది. టోర్నీలో భాగంగా మే 30, 2019న ఆతిథ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రౌండ్ రాబిన్ విధానంలో జరిగే 2019 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.
రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వహకులు నిర్వహించనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.