
హైదరాబాద్: కొత్త సంవత్సరాన్ని గొప్పగా ఆరంభించింది విదర్భ, అంతే కాదు. రంజీ క్రికెట్ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఎవరూ ఊహించని రీతిలో దూసుకుపోయింది. అంచనాలు ఏమీ లేని జట్టు విజేతగా కప్పును అందుకుంది. ఇప్పటికి వరకు ఏడు సార్లు విజేత అయిన ఢిల్లీ జట్టు విదర్భ జట్టుకు తలవంచక తప్పలేదు. అసలు ఫైనల్‌కు చేరడమే గొప్ప అనుకున్న ఆ జట్టు ఏకంగా తొలిసారి ఫైనల్‌లో అడుగిడి సరిపెట్టుకోలేదు. గట్టి పోటీనిచ్చి మ్యాచ్‌ను కొట్టి పడేసింది.

ఇలా గెలిచింది.:
ఉడుకు రక్తంతో ఉరకలెత్తిన ఫయాజ్ ఫజల్ సేన బరిలోకి దిగిన విదర్భ..టైటిల్ కలను నెరవేర్చుకుంది. ఢిల్లీపై ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన విదర్భ నాలుగు రోజుల్లోనే ముగిసిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 29 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే కెప్టెన్ ఫజల్(2) వికెట్ కోల్పోయినా..సంజయ్(9 నాటౌట్), జాఫర్(17 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్‌తో పాటు 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన విదర్భ బౌలర్ గుర్బానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
విదర్భకు భారీ ఆధిక్యం:
అంతకుముందు 528/7 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ 547 పరుగులకు ఆలౌటైంది. అక్షయ్ వాడ్కర్(133) తన ఓవర్‌నైట్ స్కోరుకు పరుగులేమి జతచేయకుండానే వెనుదిరుగగా, నెరాల్(74) ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఢిల్లీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు విలువైన పరుగులు జతచేశారు. ఈ క్రమంలో ఎనిమిదో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అక్షయ్ అండతో దూకుడుగా ఆడిన నెరాల్..8 ఫోర్లు, 4 భారీ సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. వీరి జోరును అడ్డుకునేందుకు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్..బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. అయితే ఇన్నింగ్స్ 162వ ఓవర్లో నవ్‌దీప్‌సైనీ(5/135) ఈ జోడీని విడగొట్టాడు. వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చిన నెరాల్..ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే వాడ్కర్, థకారె(0) ఔట్ కావడంతో 547 పరుగుల వద్ద విదర్భ మూడు వికెట్లు కోల్పోయింది. సుదాన్(2/102), క్రేజోలియా(2/132) రెండేసి వికెట్లు పడగొట్టారు.
వాఖరే, సర్వతేల బౌలింగ్ ముందు ఢిల్లీ డమ్మీ:
విదర్భ పదునైన బౌలింగ్ ధాటికి విదర్భ ఘోరంగా తడబడింది. 252 పరుగుల లో టుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ..విదర్భ స్పిన్నర్లు వాఖరే (4/95), సర్వతే (3/30) విజృంభణకు 280 పరుగులకే కుప్పకూలింది. సెమీఫైనల్లో సెంచరీ చేసి ఊపు మీద ఉన్న ఓపెనర్ చండేలా(9) ఘోర వైఫల్యంతో నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన చండేలా, రెండో ఇన్నింగ్స్‌లోనూ తేలిపోయాడు. ఆరంభంలోనే విదర్భ స్పిన్నర్ వాఖరే వేసిన బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో చండేలా(9)..గుర్బానీకి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు సీనియర్ గౌతమ్ గంభీర్ (36, 7ఫోర్లు) అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు.
బొటనవేలి గాయంతో బాధపడిన గౌతీ..విదర్భ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని దూకుడుగా ఆడాడు. 37 బంతుల్లోనే 36 పరుగులు చేసిన గంభీర్...గుర్బానీ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. అయితే ఆ బంతి లెగ్ స్టంప్ పక్కకు వెళుతున్నట్టుగా రీప్లేలో కనిపించింది. దీంతో గంభీర్ నిరాశగా పెవిలియన్‌కు వెళ్లాడు.
50 పరుగులకే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో షోరే(62), రానా (64) ఆదుకున్నారు. విదర్భ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీలు సాధించారు. ఈ క్రమంలోనే అర్ధశతకాలు సాధించిన ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 114 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించారు. అయితే ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే నిష్క్రమించడంతో ఢిల్లీకి కష్టాలు మొదలయ్యాయి. ఇక్కణ్నుంచి పంత్‌సేన ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇదే అదునుగా విదర్భ కెప్టెన్ ఫజల్ వేసిన స్పిన్ తంత్రం బాగా పనిచేసింది. విదర్భ స్పిన్నర్లు సర్వతే, వాఖరే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో గింగిరాలు తిరిగే బంతులతో ఢిల్లీని కోలుకోనీయలేదు.ఈ క్రమంలో కెప్టెన్ రిషబ్ పంత్ (32) నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు.
రెచ్చి.పోయిన విదర్భ:
నెరల్ ఆఫ్‌స్టంప్ దిశగా వేసిన బంతిని రిషబ్ మిడ్ వికెట్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. బంతి ఫీల్డింగ్ చేస్తున్న వాంఖడే చేతుల్లో చక్కగా కూర్చుంది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో విదర్భ బౌలర్లు టెయిలెండర్ల వికెట్లను కుప్పకూల్చారు. వికాస్ (34) కాసేపు పోరాడినా, హిమ్మత్ (0), మనన్ (8), సైనీ (5), సుదన్ (18) పెవిలియన్‌కు క్యూ కట్టారు. వాఖరే, సర్వతే ధాటికి 116 పరుగుల తేడాతో చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లు వికెట్లు సమర్పించుకోవడంతో స్వల్ప ఆధిక్యానికే పరిమితమైంది.
విదర్భకు 5 కోట్ల నజరానా
గుర్బానీ(2/92)కు రెండు వికెట్లు దక్కగా, నెరాల్(1/39) మరో వికెట్ తీశాడు. మరో రోజు మిగిలి ఉండగానే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన విదర్భ.. రంజీ ట్రోఫీని గెలిచి కొత్త సంవత్సరాన మధుర ఘట్టాన్ని ఆవిష్కరించింది. రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన విదర్భకు రూ.5 కోట్ల నజరానా లభించింది. ట్రోఫీ గెలిచినందుకు విజేతకు దక్కే రూ.2 కోట్లతో పాటు విదర్భ క్రికెట్ అసోసియేషన్(వీసీఏ) రూ.3 కోట్లు ప్రకటించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.