హైదరాబాద్: రంజీ ట్రోఫీలో భాగంగా విదర్భ-బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ ఆల్ రౌండర్ ఆదిత్య సర్వాతే తలకు బలంగా బంతికి తగలడంతో క్రీజులో కుప్పకూలిపోయాడు.
శుక్రవారం మూడో రోజు ఆటలో భాగంగా ఆదిత్య 60 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా ప్రత్యర్థి జట్టు ఆటగాడు ఇషాన్ పోరెల్ వేసిన బంతి అతనికి బలంగా తాకింది. బంతిని పుల్ చేసే క్రమంలో అది కాస్తా మిస్ అయి హెల్మెట్‌కు కుడివైపున తగిలింది. దీంతో అతడు మైదానంలోనే కిండపడిపోయాడు.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆదిత్యను క్రీజు నుంచి బయటికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆదిత్యకు సకాలంలో వైద్యం అందించడంతో అతను తేరుకున్నట్లు విదర్బ జట్టు అధికారి ఒకరు తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆదిత్య 89 పరుగులవ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని విదర్భ జట్టు అధికారి స్పష్టం చేశారు. విదర్భ తన తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగులు చేసింది. అనంతరం బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది.