హైదరాబాద్: శ్రీలంకతో జరగనున్న ఐదు వన్డేల సిరిస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
దీంతో ఐదు వన్డేల సిరిస్‌కు గాను రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. పదేళ్ల క్రితం తాను భారత్ తరఫున ఆడాలని కోరుకున్నట్టు తెలిపాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్ అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నాడు.
'భారత్‌కు వైస్ కెప్టెన్‌గా ఉండడం గొప్ప గౌరవం. ఒక్కప్పుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తే చాలులే అనే విధంగా నాలో ఆలోచనలు సాగుతూ ఉండేవి. ఇప్పుడు వైస్ కెప్టెన్సీ దక్కడం మంచి అనుభూతినిస్తోంది. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. అనుభవం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది' అని అన్నాడు.

మరోవైపు వైస్ కెప్టెన్సీ నుంచి గురించి అతిగా ఆలోచించకుండా ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ప్రస్తుతం నేను బాగా రాణించాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఒక క్రికెటర్‌గా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నానని తెలిపాడు.
రిజర్వు బెంచీపై కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడరని అయితే జట్టు కూర్పును బట్టి కొన్ని సార్లు తప్పదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. శ్రీలంకపై తనకు మంచి రికార్డు ఉందని దాన్నే కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీకి టీమిండియాకు చాలా వైరుధ్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపాడు. ఐపీఎల్‌తో పోలిస్తే అంతర్జాతీయ క్రికెట్ భిన్నంగా సాగుతుందన్నాడు. ఉత్సాహం మాత్రం అలాగే ఉంటుందని చెప్పాడు.