
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కొంత కాలంగా ఏమాత్రం రాణించడం లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అతని ఆటతీరు చాలా ఆందోళనకరంగా ఉంది. శుభ్‌మన్ గిల్ వంటి యంగ్ ప్లేయర్లను కాదని జట్టులోకి తీసుకుంటే ఏమాత్రం రాణించడం లేదు. సర్ఫరాజ్ ఖాన్ వంటి వాళ్లు దేశవాళీల్లో చెలరేగుతున్నా భారత జట్టులో అవకాశం రావడం లేదు. కానీ రాహుల్‌కు మాత్రం వరుస పెట్టి అవకాశాలు ఇస్తుండటం చాలా విమర్శలకు కూడా దారి తీసింది. దీనిపై భారత వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
'రాహుల్‌ను నెక్స్ట్ మ్యాచ్‌లో పక్కన పెడతారని తనకు కూడా తెలుసు. ఈ నిర్ణయం కేవలం ఏదో ఒక ఇన్నింగ్స్ వల్ల కాదు. గత ఐదారు టెస్టు మ్యాచుల్లో అతని ఆటతీరు అలా ఉంది. అతనో క్లాస్ ప్లేయర్. అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్ధుడు. ప్రస్తుతం అతను ఇలా ఫామ్ కోల్పోవడానికి కారణం టెక్నిక్ అని నాకు అనిపించడం లేదు. అతని బుర్రలో ఏదో నడుస్తోంది. అందుకే ఇలా ఫెయిలవుతున్నాడు. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో? వన్డేలకు ఫ్రెష్‌గా వస్తాడని అనుకుంటున్నా' అని డీకే చెప్పాడు.
తన కెరీర్‌లో కూడా ఇలాంటి ఫేజ్ అనుభవించానని, కాబట్టి రాహుల్ ఎలా ఫీలవుతున్నాడో తనకు తెలుసునని డీకే అన్నాడు. తనకు అలా జరిగినప్పుడు వాష్‌రూంలోకి వెళ్లి ఎవరి కంటా పడకుండా కన్నీళ్లు పెట్టుకునే వాడినని గుర్తుచేసుకున్నాడు. 'ఇదంతా ప్రొఫెషనల్ ప్రపంచం. ఇలాంటి బాధాకరమైన సందర్భాలను కూడా ఎదుర్కోక తప్పదు. ఇదే ఇక చివరి అవకాశం అనే మ్యాచ్‌లో అలా అవుటవడం చాలా బాధగా ఉంటుంది. నా కెరీర్‌లో కూడా అలా జరిగింది. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి, ఏమీ మాట్లాడకుండా టాయిలెట్‌లోకి వెళ్లి కన్నీళ్లు కార్చేవాడిని. అంతకుమించి మన చేతుల్లో ఏమీ ఉండదు' అని డీకే తన అనుభవాలను పంచుకున్నాడు.