హైదరాబాద్: యువ ఆటగాడు హార్దిక్ పాండ్యాకు భారత టెస్టు జట్టులో చోటు కల్పించడంపై టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే సమర్ధించుకున్నాడు. బరోడాకు చెందిన 23 ఏళ్ల పాండ్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే.
ఈ ప్రదర్శనే ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 భారత జట్టులో ఎంపిక చేసేలా చేసిందని కుంబ్లే తెలిపాడు. అంతేకాదు ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు జట్టులో పాండ్యా సభ్యుడిగా ఉన్నాడు. ఇంగ్లాండ్ టెస్టు సిరిస్‌కు జట్టులో చోటు దక్కించుకున్నా గాయం కారణంగా దూరమయ్యాడు.
బంగ్లాదేశ్ టెస్టు నేపథ్యంలో అనిల్ కుంబ్లే మంగళవారం (ఫిబ్రవరి 7)న మీడియాతో మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా వన్డేల మాదిరి టెస్టుల్లో కూడా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో పాండ్యాను మిడిల్ ఆర్డర్‌లో దించనున్నట్లు కుంబ్లే తెలిపాడు.

'ఎవరైతే 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలుగుతారో, అలాంటి వారు మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో సత్తా చాటతారు. ఆ సామర్థ్యం పాండ్యాకు ఉంది' అని కుంబ్లే పేర్కొన్నాడు. టెస్టు ఫార్మాట్‌లో పాండ్యాను ఇప్పటివరకు సరిగా టెస్టు చేయలేదని కుంబ్లే తెలిపాడు.
ఇప్పటివరకు పాండ్యా టీమిండియా తరుపున 7 వన్డేలు, 19 వన్డేలు ఆడాడు. జనవరి 2016లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు.