ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో యువ క్రికెటర్ వెంటకేశ్ అయ్యర్ ఏకంగా రూ.23.75 కోట్లు పలికాడు. ఈ ఆల్‌రౌండర్ కోసం ఆర్సీబీతో తీవ్రంగా పోటీపడి డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ రూ.కోట్లు కుమ్మరించి తన ఫ్రాంచైజీలోనే కొనసాగించింది. ఈ క్రమంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ చరిత్ర సృష్టించాడు. అయితే క్రికెట్ కంటే చదువు ఎంతో ముఖ్యమని వెంకటేశ్ పేర్కొన్నాడు. ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
చచ్చేదాక చదువు మనతోనే ఉంటుందని, కానీ 60 ఏళ్ల వయస్సులో ఆటను కొనసాగించలేమని వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. బాగా చదువు కంటే అది ఆటలోనూ ఉపయోగపడుతుందని తెలిపాడు.ఇక అతన్ని అతిత్వరలో డాక్టర్ వెంకటేశ్ అయ్యర్ అని పిలుస్తారని చెప్పాడు. 29 ఏళ్ల వెంకటేశ్ ఐపీఎల్‌లో 50 మ్యాచ్‌లు ఆడాడు. 137 స్ట్రైక్‌రేటుతో 1326 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో కేకేఆర్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులు సాధించి టైటిల్ పోరును ఏకపక్షంగా మార్చాడు.

''ఫైనల్ మ్యాచ్ అనంతరం మా అమ్మ గ్రౌండ్‌లోకి వచ్చింది. మా అమ్మని ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్ కలిశారు. ఆమె ముందు నన్ను పొగిడారు. మీ అబ్బాయిని చాలా మంచి పిల్లాడని అన్నారు. ఆ సమయంలో మా అమ్మ కళ్లల్లో ఆనందాన్ని నేను చూశాను. ఆ క్షణాన్ని నేను మరవలేను. అవి ఎంతో అద్భుతమైన మధుర క్షణాలు''
''ఇక చదువు మనం చచ్చేవరకు మనతోనే ఉంటుంది. 60 ఏళ్ల వయస్సులో క్రికెటర్ ఆటను ఆడలేడు. బాగా చదువుకున్న వ్యక్తి మైదానంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలడు. ఫైనాన్స్‌లో నేను పీహెచ్‌డీ చేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ నన్ను ఇంటర్వ్యూ చేసే సమయానికి డాక్టర్.వెంటకేశ్ అయ్యర్ అని పిలుస్తారు'' అని వెంకటేశ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో 2021 సీజన్‌లో అరంగేట్రం చేసిన వెంకటేశ్ కేకేఆర్ తరఫునే కొనసాగుతున్నాడు. తొలుత వెంకటేశ్‌ను కోల్‌కతా రిటైన్ చేసుకోలేదు. కానీ వేలంలో భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.