ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నీలో అద్భుతమైన క్యాచ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. బర్మింగ్‌హాం ఫోనిక్స్, వెల్ష్ ఫైర్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆల్‌రౌండర్ రోలాఫ్ వాన్ డర్ మెర్వ్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన వెల్ష్ ఫైర్ టీం.. టోర్నీలో రెండో విజయం నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఫోనిక్స్ టీం స్టార్ మొయీన్ అలీ (17) అవుట్ చేయడానికి వాన్ డర్ మెర్వ్ అందుకున్న క్యాచ్ అందరికీ షాకిచ్చింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ డేవిడ్ పేన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు అలీ ప్రయత్నించాడు. దీంతో లాంగాన్ దిశగా ఈ బంతి బాగా ఎత్తుగా వెళ్లింది.

అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డర్ మెర్వ్ వేగంగా పరిగెత్తుకొచ్చి ఆ క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బాగా ఎత్తుగా వెళ్లిన ఆ బంతి.. అతని చేతుల్లో పడి బయటకు వచ్చేసి, ఛాతీపై పడి ముందుకు వెళ్లిపోయింది. ఈ సమయంలో చాలా చురుగ్గా కదిలిన వాన్ డర్ మెర్వ్.. బంతి నేలకు తాకకముందే ఒంటిచేత్తో క్యాచ్ పూర్తి చేశాడు.
ఇలా మైదానంలో వెల్ఫ్ ఫైర్ టీం సభ్యులంతా చిరుతల్లా కదలడంతోపాటు బౌలర్లు కూడా రాణించడంతో ఫోనిక్స్ కేవలం 112/7 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని వెల్ష్ ఫైర్ జట్టు కేవలం 85 బంతుల్లోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వాన్ డర్ మెర్వ్ విన్యాసాలు చూసిన ఫ్యాన్స్.. ఈ క్యాచ్ కళ్లారా చూసినా నమ్మలేం అంటున్నారు. ఇంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండటం చాలా అరుదంటూ మెచ్చుకుంటున్నారు. అతను డైవ్ చేసిన విధానం, బంతి చేజారినా తడబడకుండా క్యాచ్ పూర్తిచేయడం సూపర్ అని కొనియాడుతున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి మరి.