చెన్నై వేదికగా ఆస్ట్రేలియా అండర్-19తో జరుగుతున్న తొలి టెస్టులో యువ భారత జట్టు సత్తాచాటుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ చేసిన స్కోరుకు టీమిండియా దీటుగా సమాధానమిచ్చింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 71.4 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. ఎయిడన్ ఒకానర్ (61), రిలే కింగ్సెల్ (53) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో మహ్మద్ ఇనాన్, సమర్థ్ నాగరాజు చెరో మూడు వికెట్లు, ఆదిత్య రావత్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 62.4 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు శతకం బాదాడు. 62 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అయితే జోరు మీదున్న అతను దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. మరో ఓపెనర్ విహాన్ మల్హోత్రా (76) కూడా రాణించాడు. అయితే మిగిలిన బ్యాటర్లు ఓపెనర్ల జోరును కొనసాగించలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో విశ్వ రామ్‌కుమార్ నాలుగు, థామస్ బ్రౌన్ మూడు వికెట్లు తీశారు.

అయితే శతకం సాధించిన వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 13 ఏళ్ల 188 రోజుల వయసులో సూర్యవంశీ శతకం సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో పేరిట ఉండేది. నజ్ముల్ 14 ఏళ్ల 241 రోజుల వయస్సులో సెంచరీ చేశాడు. 2013లో శ్రీలంకపై ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డును సూర్యవంశీ బద్దలుకొట్టాడు.
కాగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 67.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రిలే కింగ్సెల్ (48) టాప్ స్కోరర్. మహ్మద్ ఇనాన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. సోహమ్ పట్వర్థన్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ బుధవారం ఆటలో లంచ్ విరామానికి వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు.