భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజాలు చిన్న వయసులోనే తమదైన ముద్ర వేసి చరిత్రలో నిలిచిపోయారు. అయితే ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారిన పేరు వైభవ్ సూర్యవంశీ. బీహార్లోని ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు కేవలం తన బ్యాటింగ్ నైపుణ్యంతోనే కాకుండా మైదానంలో చూపిస్తున్న పరిణతితో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. సిక్సులు కొట్టడం ఇంత ఈజీనా అంటూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. చిన్నప్పటి నుంచే పరుగుల దాహం.. భారీ సెంచరీలు సాధించాలనే పట్టుదల వైభవ్ సూర్యవంశీని సమకాలీన యువ క్రికెటర్ల కంటే భిన్నంగా నిలబెట్టాయి.
రాహుల్ ద్రవిడ్ దృష్టిని ఆకర్షించిన యువకెరటం
సాధారణంగా ఏ యువ ఆటగాడికైనా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు దక్కడం అంటే అది ఓ గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. వైభవ్ సూర్యవంశీ విషయంలో ఇది చాలా ఆసక్తికరంగా జరిగింది. ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ నేషనల్ క్రికెట్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసేవారు. తన కొడుకు ద్వారా వైభవ్ సూర్యవంశీ అసాధారణ టాలెంట్ గురించి తెలుసుకున్న రాహుల్ ద్రవిడ్.. వెంటనే రంగంలో దిగాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఈ కుర్రాడికి ఉన్న అద్భుతమైన ఫుట్ వర్క్, టైమింగ్ గురించి నిర్ధారించుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌కు రాహుల్ ద్రవిడ్ గైడెన్స్ అతడి కెరీర్‌కు పెద్ద మలుపుగా మారింది.

ద్రవిడ్ సవాల్‌ను 3 బంతుల్లోనే ఊదేశాడు..!
ఐపీఎల్ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్ వైభవ్ సూర్యవంశీ కెరీర్లో అత్యంత కీలకమైన ఘట్టం. రాజస్థాన్ రాయల్స్ స్కౌట్ సమర్ ఖాద్రీ సిఫార్సుతో ట్రయల్స్‌కు వచ్చిన వైభవ్ సూర్యవంశీ ముందు రాహుల్ ద్రవిడ్ ఓ కఠినమైన ఛాలెంజ్ ఉంచారు. 6 బంతుల్లో 15 పరుగులు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించగా.. వైభవ్ సూర్యవంశీ ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా మొదటి 3 బంతుల్లోనే వరుసగా 3 సిక్సర్లు బాది ఆ లక్ష్యాన్ని ఛేదించాడు. కేవలం స్ట్రైట్ హిట్టింగ్ మాత్రమే కాకుండా.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సూచన మేరకు మైదానం నలుమూలలా షాట్లు ఆడి తనలో ఉన్న '360 డిగ్రీ' ప్లేయర్‌ను నిరూపించుకున్నాడు.
భవిష్యత్తు ఆశాకిరణంలా మారిన వైభవ్
ఈ అద్భుత ప్రదర్శన ఫలితంగానే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వైభవ్ సూర్యవంశీని రికార్డు స్థాయిలో వేలంలో సొంతం చేసుకుంది. అత్యంత చిన్న వయసులోనే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకోవడమే కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో ఉన్న దూకుడు, టెక్నికల్ లోపాలు లేని ఆటతీరు చూస్తుంటే అతను అతి త్వరలోనే టీమిండియా సీనియర్ జట్టులో చోటు సంపాదించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ కేవలం టాలెంట్ ఉన్న ఆటగాడు మాత్రమే కాకుండా టీమిండియా క్రికెట్ కు భరోసాగా నిలుస్తున్నాడు. క్రమశిక్షణతో కూడిన ఆటను కొనసాగిస్తే భవిష్యత్తులో టీమిండియా తరఫున ఆ ఆటగాడి పేరు మారుమోగుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.