టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్‌తో రెచ్చిపోయాడు. అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే యూఏఈ (UAE) జట్టుపై కేవలం 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్, యూఏఈతో తలపడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు వైభవ్ విధ్వంసకర ఆరంభాన్ని అందించాడు.
వైభవ్ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఓవరాల్‌గా 95 బంతుల్లో 171 పరుగుల భారీ స్కోరును సాధించాు. ఇందులో 9 ఫోర్లు, 14 సిక్సులు బాదడం విశేషం. భారత్ 33 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్ ఆయుష్ మాత్రే రెండో ఓవర్‌లోనే ఔటైనా, వైభవ్ దాని ప్రభావం పడకుండా దూకుడుగా ఆడాడు. 30 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసిన వైభవ్, ఆ తర్వాత మరింత ప్రమాదకరంగా మారి కేవలం 26 బంతుల్లోనే తదుపరి 50 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు.

యూఏఈ ఫీల్డర్ల తప్పిదాల వల్ల వైభవ్‌కు రెండుసార్లు లైఫ్ లభించింది. వైభవ్ 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫీల్డర్లు సులభమైన క్యాచ్‌ను జారవిడిచారు. 85 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరోసారి క్యాచ్ డ్రాప్ అయింది.యూఏఈ చేసిన ఈ పొరపాట్లను వైభవ్ పూర్తిగా సద్వినియోగం చేసుకుని, వారి బౌలర్లపై ఉప్పు చల్లినట్లుగా సెంచరీతో సమాధానం చెప్పాడు.
2025లో పరుగుల సునామీ
వైభవ్ సూర్యవంశీకి 2025 సంవత్సరం అద్భుతంగా సాగుతోంది. ఈ ఏడాది వివిధ టోర్నమెంట్‌లలో అతని బ్యాట్ నిప్పులు చెరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరఫున ఆడుతూ మహారాష్ట్రపై 61 బంతుల్లో 108 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. రైజింగ్ ఆసియా కప్ టోర్నమెంట్‌లోనూ యూఏఈపైనే 44 బంతుల్లో 144 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ యువ స్టార్ ఐపీఎల్ డెబ్యూలో వేగవంతమైన సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా యూత్ వన్డే, యూత్ టెస్ట్, ఇండియా-A తరఫున ఆడుతూ కూడా సెంచరీలు కొట్టి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. తాజాగా అండర్-19 ఆసియా కప్‌లో సాధించిన ఈ విధ్వంసక సెంచరీ, రాబోయే అండర్-19 ప్రపంచ కప్‌కు వైభవ్ ఎంత ప్రమాదకరమైన ఆటగాడో ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక పంపింది.