ఐపీఎల్ కప్ చేజారాక వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ రియాక్షన్!
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత రాజస్థాన్ రాయల్స్ క్యాంపులో తీవ్ర నిరాశ నెలకొంది. టైటిల్ పోరుకు ఇంత దగ్గరగా వచ్చి టోర్నీ నుంచి నిష్క్రమించడాన్ని రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసిన 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఓటమితో తీవ్రంగా కలత చెందాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం డగౌట్లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగపూరిత సందేశాన్ని షేర్ చేశాడు.
ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన తర్వాత ఆ ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ మెసేజ్‌ను వైభవ్ సూర్యవంశీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా రీ-షేర్ చేస్తూ.. ఓటమిపై తన మొదటి రియాక్షన్‌ను ఇచ్చాడు. ఈ పోస్ట్‌ను చూస్తే గుజరాత్ చేతిలో ఎదురైన పరాజయం వైభవ్ సూర్యవంశీని ఎంతలా గాయపరిచిందో స్పష్టంగా అర్థమవుతోంది.

వైభవ్ సూర్యవంశీ షేర్ చేసిన ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసి ఉంది.. "కేవలం 20 ఓవర్ల వ్యవధిలో మనుషుల భావోద్వేగాలు ఇంత త్వరగా ఎలా మారిపోతాయో ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఈ రాత్రి మాకు చాలా బాధను మిగిల్చింది. ఈ గాయం మా గుండెల్లో లోతుగా గుచ్చుకుంది. ప్రస్తుతం మా మనసంతా తీవ్రమైన ఉదాసీనత, నిరాశ, నిస్పృహలతో నిండిపోయింది. అయితే ఎవరికి దక్కాల్సిన క్రెడిట్ వారికి ఇవ్వాలి. ఈ రాత్రి శుభ్‌మన్ గిల్, గుజరాత్ టైటాన్స్ ఆటతీరు నిజంగా అద్భుతం." అని వైభవ్ పోస్ట్ చేశాడు.
ఆ పోస్ట్‌లో అభిమానులకు కృతజ్ఞతలు, క్షమాపణలు చెబుతూ.. "ఈ యువ జట్టును నమ్మి, ప్రతి క్షణం మాకు మద్దతుగా నిలిచి, ఈ సీజన్‌లోని మొత్తం 16 మ్యాచ్‌లలో మా కోసం గొంతు చించుకుని అరిచిన ప్రతి ఒక్క అభిమానికి పేరుపేరునా ధన్యవాదాలు. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి మాకు మాటలు సరిపోవడం లేదు. అదే సమయంలో మేము మీకు క్షమాపణలు కూడా చెబుతున్నాం. మీరు ఆశించిన ఆ అద్భుతమైన విజయాన్ని ఈ రాత్రి మేము మీకు అందించలేకపోయాం. అత్యంత కీలకమైన సమయంలో మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. ఈ ఓటమి బాధ మా మనసుల్లో ఇలాగే ఉంటుంది.. వచ్చే సీజన్‌లో మరింత బలంగా, మరింత మెరుగ్గా తిరిగి వచ్చే వరకు ఈ కసిని మాలోనే దాచుకుంటాం" అని రాజస్థాన్ రాయల్స్ జట్టు పేర్కొంది.
కాగా ఈ ఐపీఎల్ సీజన్ చివరి రెండు నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీ తృటిలో సెంచరీలు చేజార్చుకోవడం గమనార్హం. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 97 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. క్వాలిఫైయర్-2లో గుజరాత్‌పై కూడా 96 పరుగులతో క్లాస్ ప్రదర్శన చేశాడు. అతని మెరుపు బ్యాటింగ్ వల్లే రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. అయితే రాజస్థాన్ బౌలర్లు ఈ భారీ స్కోరును కాపాడుకోలేకపోయారు. శుభ్‌మన్ గిల్ వీరోచిత శతకంతో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications