IPL 2026: సాధారణంగా క్రికెట్ ప్రపంచంలో ఓ బ్యాటర్ విజయం సాధించాలంటే మంచి టెక్నిక్ ఉండాలి. కానీ వైభవ్ సూర్యవంశీ విషయంలో అది కేవలం టెక్నిక్ మాత్రమే కాడు.. ఓ విలక్షణమైన ఆలోచనా విధానం. స్టేడియంలో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ పట్టుకునే తీరు, బంతిని బాదే విధానం చూస్తుంటే ఓ యుద్ధ వీరుడు కత్తిని తిప్పుతున్నట్లే ఉంటుంది. సంప్రదాయ క్రికెట్ పాఠాలకు భిన్నంగా వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌ల అతడి బ్యాటింగ్ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
'డబుల్ మూవ్‌మెంట్' మాయాజాలం
ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిని పరిశీలించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా బ్యాటర్లు బంతి వచ్చే ముందు బ్యాట్‌ను పైకెత్తి దాన్ని కిందకు తెస్తూ షాట్ ఆడతారు. కానీ వైభవ్ సూర్యవంశీ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ 'డబుల్ మూవ్‌మెంట్' అత్యంత అరుదుగా చూస్తూ ఉంటాం. వైభవ్ మొదట బ్యాట్‌ను పైకి ఎత్తుతాడు.. అది కొంచెం కిందకు వచ్చి, మళ్లీ ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఈ విలక్షణ కదలిక వల్ల వైభవ్ సూర్యవంశీకి అదనపు పవర్ లభిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు ఇంత వేగంగా బ్యాట్ కదల్చడం అసాధారణమైన విషయమని ఆకాష్ చోప్రా పేర్కొన్నారు.

అసాధారణ బ్యాట్ యాంగిల్
వైభవ్ సూర్యవంశీ బ్యాట్ ఎత్తినప్పుడు దాని దిశ చాలా వింతగా.. ఓ రకంగా ఉంటుంది. వైభవ్ బ్యాట్ ఫేస్ నేరుగా కాకుండా కవర్స్ దిశగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అక్కడి నుంచే వైభవ్ ఒక్కసారిగా బ్యాట్‌ను గుండ్రంగా తిప్పుతూ బంతిపై విరుచుకుపడతాడు. సంప్రదాయ కోచింగ్‌లో ఇలాంటి యాంగిల్ సాధారణంగా నేర్పరు. కానీ వైభవ్ దీన్నే తన ప్రధాన ఆయుధంగా మార్చుకున్నాడు. దీనివల్ల బౌలర్లకు బంతి ఎటు వెళ్తుందో అంచనా వేయడం దాదాపు అసాధ్యం అవుతోంది.
సుత్తిలా కాదు.. వేటకొడవలిలా..
వైభవ్ సూర్యవంశీ షాట్లలో కేవలం కండబలం మాత్రమే కనిపించదు. వైభవ్ బ్యాటింగ్ ఒక సుత్తితో కొట్టినట్లు కాకుండా, గాలిని చీల్చుకుంటూ వెళ్లే ఒక వేటకొడవలిలా ఉంటుంది. అతని బ్యాట్ స్వింగ్‌లో ఒక రకమైన రిథమ్ ఉంటుంది. అది బంతిని కేవలం కొట్టదు, ఆకాశంలోకి 'లాంచ్' చేస్తుంది. అతని మణికట్టులో అద్భుతమైన బలం ఉంది. అతని వెనుక చేతి శరీరం నుంచి కొంచెం దూరంగా ఉండటం వల్ల బాటమ్ హ్యాండ్‌ను పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల టైమింగ్‌తో పాటు ఊహించని వేగం తోడవుతుంది.
బౌలర్ల మైండ్ గేమ్‌తో చెలగాటం
వైభవ్ సూర్యవంశీ కదలికలు సంప్రదాయబద్ధంగా ఉండవు కాబట్టి, బౌలర్లు ఎక్కడ బంతి వేయాలో తెలియక తడబడుతున్నారు. బ్యాట్ ఎత్తడం, మళ్లీ కిందకు తెచ్చి మళ్లీ పైకి లేపడం.. ఈ ప్రక్రియ అంతా సెకనులో పదో వంతు కాలంలోనే జరిగిపోతుంది. బౌలర్ తన వ్యూహాన్ని మార్చుకుని స్పందించే లోపే బంతి బౌండరీ అవతల ఉంటోంది. అతని వేగవంతమైన బ్యాట్ స్పీడ్ ముందు సీఎస్కే వంటి దిగ్గజ జట్ల బౌలర్లు సైతం నిస్సహాయంగా నిలబడటం కూడా కనిపించింది.
సంప్రదాయాలను సవాలు చేస్తూ..
క్రికెట్ అంటే కేవలం పుస్తకాల్లోని టెక్నిక్ మాత్రమే కాదు.. మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని వైభవ్ సూర్యవంశీ నిరూపిస్తున్నాడు. తనపై తనకు ఉన్న అచంచలమైన విశ్వాసమే అతడిని ఒక 'గేమ్ ఛేంజర్'గా మార్చింది. వైభవ్ సూర్యవంశీ బ్యాట్ ఒక తల్వార్‌లా తిరుగుతున్నంత కాలం, రికార్డులు తిరగరాయబడుతూనే ఉంటాయి. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి పరిణతితో ఆడుతున్న వైభవ్.. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఆశాకిరణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.