Vaibhav Suryavanshi: తన ధమాకా బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో పేరు తెచ్చుకుంటున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం వైభవ్ తన బ్యాటింగ్ వల్ల కాకుండా.. స్టేడియంలో ప్రత్యర్థి జట్టు ఆటగాడితో గొడవపడి వార్తల్లో నిలిచాడు. పాట్నాలోని మొయిన్-ఉల్-హక్ స్టేడియంలో బీహార్, మేఘాలయ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాదిరిగా దూకుడుగా వ్యవహరించాడు. వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి జట్టు ఆటగాడితో గొడవపడగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరలవుతున్న వీడియోలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. మేఘాలయ ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన వైభవ్ సూర్యవంశీ మేఘాలయ వికెట్ కీపర్ అర్పిత్ భాటేవారా, బౌలర్లతో గొడవపడుతున్నట్లు కనిపించాడు. అయితే పరిస్థితి మరింత దిగజారకుండా అంపైర్లు జోక్యం చేసుకుని అడ్డుకున్నారు.

విరాట్ కోహ్లీని గుర్తు చేసిన వైభవ్ సూర్యవంశీ
ఈ క్రమంలో అంపైర్లు ఇరు జట్ల ఆటగాళ్లను శాంతింపజేశారు. ఆగ్రహంతో ఉన్న వైభవ్ సూర్యవంశీని అతడి సహచర బ్యాటర్ సముదాయించడంతో తిరిగి క్రీజులోకి వచ్చాడు. బీహార్ బ్యాటర్ అయిన వైభవ్ సూర్యవంశీ ప్రవర్తన అభిమానులకు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని గుర్తు చేసింది. విరాట్ కోహ్లీ దూకుడు గురించి అందరికీ తెలిసిందే. వైభవ్ ఎప్పుడూ ప్రత్యర్థులకు సవాలు విసరడానికి, వారిపై ఒత్తిడి పెంచడానికి వెనుకాడడు. మేఘాలయపై వైభవ్ కూడా అదే చేశాడు. విరాట్ కోహ్లీ నిర్భయమైన, దూకుడు వైఖరి భారత క్రికెట్ మనస్తత్వంలో ఒక కీలక భాగమైంది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీలో కూడా అదే దూకుడు కనిపిస్తోంది.
రంజీ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ 93 పరుగులు
మేఘాలయతో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన మొదటి ఫస్ట్ క్లాస్ సెంచరీకి కేవలం ఏడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. పాట్నాలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ తర్వాత మేఘాలయ అజయ్ దుహాన్ (129),స్వాస్తిక్ ఛెత్రి (94) అద్భుతమైన ఇన్నింగ్స్‌ల సహాయంతో 408/7 వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆకాష్ చౌదరి కూడా 60 పరుగులు చేశాడు. బిహార్‌కి చివరి రోజు బ్యాటింగ్‌కు తక్కువ సమయం లభించినప్పటికీ.. సూర్యవంశీ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ యువ బ్యాటర్ కేవలం 33 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అయితే 93 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. బీహార్ 156/4 వద్ద తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.