భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. అండర్-19 ప్రపంచ కప్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు ఆరోసారి ప్రపంచ కప్‌ను అందించిన ఈ 14 ఏళ్ల కుర్రాడు. ఇప్పుడు తన దృష్టిని మైదానం నుంచి పుస్తకాల వైపు మళ్లించాడు. క్రికెట్ పిచ్‌పై బౌలర్ల పని పట్టిన ఈ యువ కిరణం.. ఇప్పుడు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం వైభవ్ ఇప్పటికీ తన పాఠశాల నుంచి అడ్మిట్ కార్డును కూడా అందుకుని.. ఓ సామాన్య విద్యార్థిగా పరీక్షల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాడు.
సెలబ్రిటీ హోదా ఉన్నా.. నిబంధనలు అందరికీ సమానమే!
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది దేశానికి గర్వకారణంగా నిలిచినప్పటికీ.. విద్యా సంస్థ నిబంధనల విషయంలో అతనికి ఎటువంటి మినహాయింపులు లేవు. బీహార్లోని సమస్తిపూర్‌లో ఉన్న పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిశోర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. "ఇది అకడమిక్ పిచ్, క్రికెట్ మైదానం కాదు" అని వ్యాఖ్యానిస్తూ.. పరీక్షా కేంద్రంలో వైభవ్ కేవలం ఒక సాధారణ విద్యార్థి మాత్రమేనని తెలిపారు. మిగిలిన విద్యార్థులకు వర్తించే నిబంధనలే వైభవ్‌కు కూడా వర్తిస్తాయని, అతనికి ఎటువంటి ప్రత్యేక ప్రోటోకాల్ లేదా రాయితీలు ఉండవని ఆయన స్పష్టంగా వివరించారు.

రికార్డుల రారాజు.. చిన్న వయసులోనే పెద్ద విజయాలు
వైభవ్ సూర్యవంశీ సాధించిన రికార్డులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవల జింబాబ్వేలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం గమనార్హం. కేవలం వరల్డ్ కప్‌లోనే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించి, రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్వారా రూ. 1.1 కోట్ల భారీ ధరను దక్కించుకున్నాడు. అంతేకాకుండా గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ బాది, టీ20 ఫార్మాట్‌లో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
పరీక్షల్లో కూడా రాణించాలని ఆకాంక్ష
మైదానంలో తన బ్యాటింగ్ తో తాండవం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. క్రికెట్ కెరీర్లో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు.. పదో తరగతి పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. క్రీడల్లో రాణిస్తూనే చదువును కూడా సమానంగా కొనసాగించాలనే వైభవ్ నిర్ణయం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.