ఐపీఎల్ 2026లో తన సంచలన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి తాజాగా ఓ భారీ సవాల్ ఎదురైంది. క్రీజులోకి రాగానే భయం లేకుండా ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటున్న ఈ కుర్రాడు.. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్‌ను కూడా అదే రీతిలో ఎదుర్కోగలడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వెస్టిండీస్ మాజీ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ ఇయాన్ బిషప్ ఈ విషయంపై స్పందిస్తూ వైభవ్ సూర్యవంశీకి కీలక సూచన చేశారు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టినంత సులభంగా స్టార్క్‌పై ఆధిపత్యం ప్రదర్శించడం సాధ్యం కాకపోవచ్చని ఇయాన్ బిషప్ అభిప్రాయపడ్డారు. మిచెల్ స్టార్క్ చాలా అనుభవం ఉన్న బౌలర్ అని.. బుమ్రా చేసిన తప్పును స్టార్క్ చేయకుండా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతాడని బిషప్ పేర్కొన్నారు. ఇది వైభవ్ సూర్యవంశీ ఓ పెద్ద ఛాలెంజ్ అని ఆయన విశ్లేషించారు.

అయితే వైభవ్ సూర్యవంశీ ఫామ్‌ను చూస్తుంటే ఏ బౌలర్‌నైనా ఊచకోత కోసేలా కనిపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ట్రెంట్ బౌల్ట్, జోష్ హేజిల్‌వుడ్ వంటి డేంజరస్ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ ఓ బేస్ బాల్ ప్లేయర్ లాగా ఉంటుందని.. అది అతనికి అదనపు బలాన్ని ఇస్తుందని బిషప్ కొనియాడారు. సాధారణంగా యువ ఆటగాళ్ల బలహీనతలు త్వరగా బయటపడతాయి.. కానీ వైభవ్ విషయంలో మాత్రం అది అంత సులభంగా కనిపించడం లేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో అండర్-19 వరల్డ్ కప్, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతుల వద్ద వైభవ్ కొంచెం తడబడినట్లు అనిపించినా.. ఇప్పుడు ఆ బలహీనతను కూడా అతను అధిగమించినట్లు కనిపిస్తోంది. బౌలర్ ఏమాత్రం లెంగ్త్ తప్పినా ఆ బంతిని స్టేడియం వెలుపలకు పంపే సత్తా ఈ యువ ఆటగాడి సొంతం. అందుకే దిగ్గజ బౌలర్లు సైతం వైభవ్‌ను అడ్డుకోవడానికి ప్లాన్ ఏ నుంచి ప్లాన్ జీ వరకు రకరకాల వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి వస్తోందని బిషప్ విశ్లేషించారు. నేటి మ్యాచ్‌లో స్టార్క్ వర్సెస్ వైభవ్ పోరు అభిమానులకు అసలైన వినోదాన్ని పంచనుంది.