Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్!
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీలో భారత యువ సెన్సేషన్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నిరాశజనకంగా ముగిసింది. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఈశాన్య జోన్ టాస్ గెలిచి తూర్పు జోన్ ను మొదట బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించింది. కొత్త బంతి పేసర్లకు అనుకూలించడంతో ఈస్ట్ జోన్ ప్రారంభంలోనే త్వరగా వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ తనదైన స్టైల్లో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఫాస్ట్ బౌలర్ బిశ్వర్జిత్ కొంతౌజమ్ బౌలింగ్ లో అద్భుతమైన కవర్ డ్రైవ్ తో వరుసగా రెండు ఫోర్లు బాది తన దూకుడును ప్రదర్శించాడు. అయితే ఈ దూకుడును వైభవ్ ఎక్కువ సేపు కొనసాగించలేకపోయాడు. అదే ఓవర్ చివరి బంతికి వైభవ్ సూర్యవంశీ మరోసారి కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించగా.. ఈ సారి టైమింగ్ తప్పింది. బంతి బ్యాట్ అంచుకు తాకి స్లిప్ లోకి వెళ్లగా.. అక్కడ జోసెఫ్ లాల్తన్ఖుమా క్యాచ్ అందుకున్నాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ తొలి దులీప్ ట్రోఫీ ఇన్నింగ్స్ 6 బంతుల్లో 8 పరుగులకే ముగిసింది. వరుసగా రెండు ఫోర్లు ఇచ్చినా బిశ్వర్జిత్ తన సంయమనాన్ని కోల్పోకుండా ఆ ఓవర్ ఆఖరి బంతికి ఆ యువ బ్యాటర్ ను ఔట్ చేసి తన అనుభవంతో కట్టడి చేయగలిగాడు.

బిశ్వర్జిత్ కొంతౌజమ్ ఎవరు?
రైట్ ఆర్మ్ పేసర్ అయిన బిశ్వర్జిత్ కొంతౌజమ్ మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు చెందినవాడు. 30 ఏళ్ల బిశ్వర్జిత్ కొంతౌజమ్కు ఇది 48వ ఫస్ట్-క్లాస్ మ్యాచ్. గతంలో అతను 47 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 27.82 సగటుతో 145 వికెట్లు పడగొట్టాడు. బిశ్వర్జిత్ 49 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 66 వికెట్లు, 46 టీ20 మ్యాచ్‌లలో 46 వికెట్లు కూడా తీశాడు.
టీ20 క్రికెట్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు, కానీ దులీప్ ట్రోఫీ అతనికి ఓ విభిన్నమైన సవాలును విసురుతోంది. రెడ్-బాల్ క్రికెట్లో కొత్త బంతి, సుదీర్ఘ ఇన్నింగ్స్‌ల అవసరం, అనుభవజ్ఞులైన దేశీయ బౌలర్లు అతని సహనాన్ని, సాంకేతికతను పరీక్షిస్తున్నాయి. వైభవ్ అరంగేట్ర ఇన్నింగ్స్ చిన్నదే అయినప్పటికీ, తన ఆటలోని మరో కోణాన్ని ప్రదర్శించడానికి ఈ టోర్నమెంట్ వైభవ్ సూర్యవంశీకి ఓ పెద్ద వేదిక. తొలి ఇన్నింగ్స్ లో వైభవ్ విఫలమైనప్పటికీ.. తనలోని మరో కోణాన్ని.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ రాణించే సత్తాను నిరూపించుకోవాలంటే వైభవ్ సూర్యవంశీ రెండో ఇన్నింగ్స్ వరకు వేచి చూడాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
