
హైదరాబాద్: టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తన జీవిత చరిత్రకు అక్షర రూపం ఇవ్వనున్నాడు. ఈ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ ఆటోబయోగ్రఫీ (ఆత్మకథ) పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ ముద్రించనుంది. ఇందులో కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలతో పుస్తకం రాయనున్నాడు. '281' పేరి ట విడుదల చేయనున్న ఈ పుస్తకాన్ని ఈ ఏడాది నవంబరు 20న అభిమానులందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ తెలిపింది.
ఈ పుస్తకంలోని అంశాలపై వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడాడు. 'ఆరంభం నుంచి చివరివరకూ ఇదొక ఉద్వేగభరితంగా సాగిన ప్రయాణం. ఇప్పుడు అనుకోకుండా పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చినప్పుడు మళ్లీ ఆ జ్ఞాపకాలలోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో నా జీవితాన్ని నేను విశ్లేషించుకునే అవకాశం వచ్చింది. ఇందులో కఠిన శ్రమ అంతే స్థాయిలో సరదాలు కూడా కనిపిస్తాయి.' అని చెప్పుకొచ్చాడు.
కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా లక్ష్మణ్ తనని ప్రశ్నలు వేయమంటూ అభిమానులను ప్రశ్నించాడు. దీంతో వేర్వేరు రకాలుగా ట్వీట్లు చేశారు. బహుశా తాను మర్చిపోయిన విషయాలను గుర్తు చేస్తారనో.. లేదా అభిమానులకు నచ్చిన అంశాలను పొందుపరిచితే బాగుంటుందనో సంభాషణ కొనసాగించాడు.
ఈ పుస్తకం విడుదల గురించి పబ్లిషర్ మాట్లాడుతూ.. వీవీఎస్ లక్ష్మణ్ జీవితంపై అందరి కళ్లు ఉన్నాయి. దానిపై నిశితమైన పరిశీలనతో కూడిన పుస్తకాన్ని అందజేస్తాం. వెస్ట్‌లాండ్ స్పోర్ట్ నుంచి ముందు ఇంప్రింట్‌ను బయటపెడతామని తెలిపారు. 2001లో కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టులో వీవీఎస్ 281 పరుగులతో చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.