ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ లో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో.. 35 ఏళ్ల వయసుపైబడిన క్రికెటర్లలో అత్యధిక పరుగులు సాధించిన తొలి ఆసీస్ బ్యాటర్ గా రికార్డుకెక్కాడు. అంటే టెస్టుల్లో.. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత 3000 పరుగుల మార్క్ ను టచ్ చేసిన తొలి ఆసీస్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో 35 లేదా అంతకుమించిన వయసులో ఏ క్రికెటర్ కూడా 3 వేల పరుగుల మార్క్ ను టచ్ చేయలేదు.
35 లేదా అంతకన్నా ఎక్కువ వయసులో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఎవరెవరు ఉన్నారంటే..
ఉస్మాన్ ఖవాజా - 3016 పరుగులు
స్టీవ్ వా - 2554 పరుగులు
అలెన్ బోర్డర్ - 2473 పరుగులు
మైక్ హస్సీ - 2323 పరుగులు
క్రిస్ రోజర్స్ - 1996 పరుగులు
డాన్ బ్రాడ్‌మన్ - 1903 పరుగులు

అత్యంత లేటు వయసులో డబుల్ సెంచరీ
రీసెంట్ గా ముగిసిన తొలి టెస్ట్‌లో ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీతో (232) మెరిశాడు. తద్వారా ఆసీస్ తరఫున డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యంత లేటు వయసులో డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఖ్వాజా 38 ఏళ్ల 43 రోజుల వయసులో.. తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని బాదాడు. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది.
తొలి నాన్ ఆసియన్ బౌలర్ గా
ప్రస్తుతం లంకతో జరుగుతోన్న రెండో మ్యాచ్ లో ఉస్మాన్ ఖ్వాజాతో పాటు నాథన్ లియోన్ కూడా ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా ఖండంలో.. టెస్టుల్లో 150కి పైగా వికెట్లు పడగొట్టిన తొలి నాన్ - ఆసియన్ బౌలర్‌గా నిలిచాడు.
ఆసియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాన్-ఆసియన్ బౌలర్లు వీరే
నాథన్ లియోన్- 30 టెస్టుల్లో 150 వికెట్లు
షేన్ వార్న్- 25 టెస్టుల్లో 127 వికెట్లు
డేనియల్ వెటోరి- 21 టెస్టుల్లో 98 వికెట్లు
జేమ్స్ ఆండర్సన్- 32 టెస్టుల్లో 92 వికెట్లు