టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభ మ్యాచ్‌లో అమెరికా సంచలన విజయాన్ని సాధించింది. డల్లాస్ వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 194 పరుగులు చేసింది. నవనీత్ దాలివాల్ (61; 44 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ కిర్టన్ (51; 31 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు.
యూఎస్‌ఏ బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరి అండర్సన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో అమెరికా 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరోన్ జోన్స్ (94 నాటౌట్; 40 బంతుల్లో, 4 ఫోర్లు, 10 సిక్సర్లు), ఆండ్రిస్ గోస్ (65; 46 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. ఓ దశలో ఎనిమిది ఓవర్లకు అమెరికా 48/2 స్కోరు మాత్రమే చేసింది.

కానీ జోన్స్-గోస్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేశారు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డారు. మూడో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో రికార్డులు బద్దలయ్యాయి. టీ20ల్లో అమెరికాకు ఇదే అత్యధిక ఛేదన. ఇటీవల కెనడాపైనే సాధించిన 169 పరుగుల ఛేజింగ్ రికార్డును ఇవాళ బ్రేక్ చేసింది. ఇక టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మూడో అత్యధిక విజయవంతమైన ఛేదన సాధించిన జట్టుగా అమెరికా చరిత్రకెక్కింది. తొలి రెండు స్థానాల్లో ఇంగ్లండ్ (230 వర్సెస్ సౌతాఫ్రికా), సౌతాఫ్రికా (206 వర్సెస్ వెస్టిండీస్) ఉన్నాయి.
అంతేగాక యూఎస్ఏ తరఫున అత్యధిక భాగస్వామ్యం కూడా ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. అమెరికా తరఫున ఏ వికెట్‌కైనా జోన్స్-గోస్ సాధించిన 131 పరుగులే అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు ఈ రికార్డు మోడానీ-గజనాధ్ సింగ్ (110 పరుగులు) పేరిట ఉండేది. అయితే జోన్స్-గోస్ టీ20 వరల్డ్ కప్‌లో ఆల్‌టైమ్ రికార్డు సాధించారు. పొట్టి కప్ చరిత్రలో అత్యధిక ఓవర్ రన్ రేటుతో పరుగులు సాధిస్తూ శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా ఆరోన్ జోన్స్- ఆండ్రీ గోస్ నిలిచారు. వీరిద్దరు 14.29 రన్‌రేటుతో పరుగులు సాధిస్తూ సెంచరీ పార్టనర్‌షిప్ నమోదుచేశారు.