టీ20 వరల్డ్ కప్-2024 ఆరంభం అదిరింది. ప్రారంభ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. డల్లాస్ వేదికగా కెనడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అమెరికా ఏడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. గ్రూప్-ఏలో ఘనంగా బోణీ కొట్టి రెండు పాయింట్లు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 194 పరుగులు చేసింది.
నవనీత్ దాలివాల్ (61; 44 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ కిర్టన్ (51; 31 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. యూఎస్‌ఏ బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరి అండర్సన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో అమెరికా 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరోన్ జోన్స్ (94 నాటౌట్; 40 బంతుల్లో, 4 ఫోర్లు, 10 సిక్సర్లు), ఆండ్రిస్ గోస్ (65; 46 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు బాదారు. టీ20ల్లో అమెరికాకు ఇదే అత్యధిక విజయవంతమైన ఛేదన.

ఛేజింగ్‌లో అమెరికాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ స్టీవెన్ టేలర్ (0; 2 బంతుల్లో)ను ఖాతా తెరవకముందే కలీమ్ సనా ఔట్ చేశాడు. కెప్టెన్ మోనాన్క్ పటేల్ (16; 16 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి వన్‌డౌన్‌లో వచ్చిన ఆండ్రిస్ గౌస్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరు నిలకడగా ఆడటంతో యూఎస్‌ఏ పవర్‌ప్లేలో 41 పరుగులు చేసింది. 8 ఓవర్లకు జట్టు స్కోరు 48 మాత్రమే.
కానీ ఆరోన్ జోన్స్ క్రీజులో అడుగుపెట్టిన తర్వాత ఇన్నింగ్స్ రూపురేఖలు మారిపోయాయి. ఆండ్రిస్‌తో కలిసి ఆరోన్ జోన్స్ విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరు ఎడాపెడా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధశతకాలు సాధించారు. అయితే ఆఖర్లో ఆండ్రీస్ ఔటైనప్పటికీ.. జోన్స్‌తో కలిసి అండర్సన్ (3; 5 బంతుల్లో) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెనడాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఆరోన్ జాన్సన్ (23; 16 బంతుల్లో, 5 ఫోర్లు), నవనీత్ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లేలో కెనడా 50 పరుగులు సాధించింది. అయితే స్వల్ప వ్యవధిలోనే ఆరోన్, పర్గాత్ సింగ్ (5; 7 బంతుల్లో) ఔటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన నికోలస్‌తో కలిసి నవనీత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో అర్ధశతకాలు అందుకున్నారు. ఆఖర్లో శ్రేయస్ (32 నాటౌట్; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటు ఝుళిపించడంతో కెనడా భారీ స్కోరు సాధించింది.