టీ20 వరల్డ్ కప్-2024లో సంచలనం నమోదైంది! మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌ను పసికూన అమెరికా మట్టికరిపించింది. డల్లాస్ వేదికగా గురువారం సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆల్‌రౌండ్ షోతో విజయఢంకా మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లు.
యూఎస్ఏ బౌలర్లలో కెంజిగె (3/30), సౌరభ్ నేత్రావల్కర్ (2/18) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. సారథి మొనాన్క్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్), ఆరోన్ జోన్స్ (36 నాటౌట్; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆంద్రీస్ గౌస్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) సత్తా చాటారు. మహ్మద్ అమీర్, నసీమ్ షా, హారిస్ రవూప్ తలో వికెట్ తీశారు.

ఛేదనలో అమెరికా 13 ఓవర్లకు 104/1తో విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత పాకిస్థాన్ బౌలర్లు పుంజుకుని మ్యాచ్‌ను హోరాహోరీగా మార్చారు. క్రమంగా వికెట్లు తీస్తూ అమెరికాపై ఒత్తిడి తెచ్చారు. షాహిన్ అఫ్రిది 18 ఓవర్‌లో 7 పరుగులు, మహ్మద్ అమీర్ 19వ ఓవర్‌లో 6 పరుగులే ఇచ్చాడు. దీంతో యూఎస్‌ఏ విజయ సమీకరణం చివరి ఓవర్‌లో 15 పరుగులుగా మారింది. హారిస్ రవూఫ్ తొలి మూడు బంతులకు మూడు పరుగులే ఇచ్చాడు.
నాలుగో బంతికి జోన్స్ సిక్సర్ బాది, అయిదో బంతికి సింగిల్ సాధించాడు. అమెరికా గెలవాలంటే ఆఖరి బంతికి అయిదు పరుగులు అవసరమవ్వగా నితీశ్ కుమార్ బౌండరీ బాది మ్యాచ్‌ను టైగా ముగించాడు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మొదటి మూడు బంతులకు అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత లయ తప్పాడు. ఏడు పరుగులను వైడ్ల రూపంలోనే సమర్పించుకున్నాడు.
అనంతరం సూపర్ ఓవర్ ఛేదనలో 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసింది. సౌరభ్ నేత్రావల్కర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. రెండో బంతిని బౌండరీకి తరలిచింన ఇఫ్తికర్ మూడో బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాదాబ్ జట్టును గెలిపించలేకపోయాడు.