హైదరాబాద్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 21 నెలలు తర్వాత కశ్యప్ ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరడం విశేషం.
పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో భాగంగా జరిగిన రెండో సెమీ పైనల్లో కొరియాకు చెందిన క్వాంగ్ హీ హెయోపై 15-21, 21-15, 21-16తో విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో హెచ్ ఎస్ ప్రణయ్ వియత్నాంకు చెందిన తియెన్ మిన్ ఎన్గుయెన్‌పై 21-14, 21-19 గెలుపొందాడు.

ఓ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు చెందిన ఇద్దరు షట్లర్లు ఫైనల్లో తలపడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ ఫైనల్లో భారత్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ తలపడిన సంగతి తెలిసిందే.
గాయం నుంచి కోలుకొని ఇటీవలే మళ్లీ రాకెట్ పట్టిన కామన్వెల్త్ క్రీడల చాంపియన్ కశ్యప్ దాదాపు రెండేళ్ల తర్వాత ఓ టోర్నీలో ఫైనల్ చేరాడు. ఇక గతేడాది స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రణయ్‌కిది ఈ ఏడాదిలో తొలి ఫైనల్.
కాగా, పురుషుల డబుల్స్‌లో సెమీస్ చేరి ఆశలు రేపిన భారత జంట సుమిత్ రెడ్డి-మను అత్రి తుదిపోరు చేరడంలో విఫలమైంది. సెమీఫైనల్లో సుమిత్ జోడీ 12-21, 21-12, 20-22తో టాప్‌సీడ్ లూ చింగ్ యావో-యాంగ్ పో హాన్ ద్వయం చేతిలో పోరాడి ఓడింది.