ప్రముఖ బాలీవుడ్ నటి, క్రికెట్ ప్రేమికులకు సైతం పరిచయం అక్కర్లేని ఊర్వశీ రౌటేలా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న వరల్డ్ కప్ ప్రమోషన్స్‌లో భాగంగా.. వరల్డ్ కప్ ట్రోఫీని అన్ని దేశాల్లో తిప్పుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ చేరిన వరల్డ్ కప్ ట్రోఫీని.. చారిత్రక ఈఫిల్ టవర్ ముందు ఆమె ఆవిష్కరించింది.
ఇలా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి నటిగా ఆమె రికార్డు నెలకొల్పింది. ఇలా తను వరల్డ్ కప్ ట్రోఫీతో ఉన్న ఫొటోలను ఊర్వశీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఐసీసీకి ధన్యవాదాలు కూడా తెలిపిందీ బాలీవుడ్ మోడల్. 'వరల్డ్ కప్ 2023 ట్రోఫీని ఆవిష్కరించిన తొలి యాక్టర్. ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద. థాంక్యూ ఐసీసీ' అని ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.

ఇలా ఊర్వశీ షేర్ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. 'నువ్వు భారత్ గర్వించదగ్గ వజ్రానివి' అని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో 'ఇప్పటి వరకు నువ్వు షేర్ చేసిన ఫొటోల్లో ఇదే బెస్ట్' అంటూ మెచ్చుకుంటున్నారు. ఇలా వరల్డ్ కప్ ఆవిష్కరించే ఘనత దక్కడం ఊర్వశీ ఎంత గొప్ప స్టార్ అని తెలియజేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఊర్వశీ టచ్ చేసిన ట్రోఫీ కచ్చితంగా భారత్‌కు దక్కుతుందని, వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా గెలుస్తుందని కొందరు జోస్యం చెప్పేస్తున్నారు. ఏదేమైనా వచ్చే అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు అక్టోబర్ 8న చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో తమ మొదటి మ్యాచ్ ఆడుతుంది. స్వదేశంలో జరిగే ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.