హైదరాబాద్: శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ టెస్టుల్లో అరంగేట్రం చేసిన 11 ఏళ్లకు సొంతగడ్డపై తొలి సెంచరీ సాధించాడు. డిసెంబర్ 18, 2005లో భారత్‌పై అరంగేట్రం చేసిన అతడు ఇప్పటి వరకు టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించాడు. అందులో మొదటిది బంగ్లాదేశ్‌పై 2006లో చేయగా, రెండోది జింబాబ్వేపై 2016లో చేశాడు.
ఈ రెండు సెంచరీలు కూడా విదేశీగడ్డపైనే చేయడం విశేషం. తాజాగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో మూడో సెంచరీ(115)ని సాధించాడు. దీంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 274/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 171 బంతుల్లో 115 పరుగులు సాధించాడు.

అందులో 11 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఉపల్ తరంగ వన్డేల్లో 14 సెంచరీలు చేశాడు. మరోవైపు దినేష్ ఛండీమాల్ (50 నాటౌట్) పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది.
సౌమ్య సర్కార్ (53), తమీమ్ ఇక్బాల్ (13) క్రీజులో ఉన్నారు. విజయానికి బంగ్లాదేశ్ ఇంకా 390 పరుగులు చేయాల్సి ఉంది. బంగ్లా చేతిలో ఇంకా పది వికెట్లు ఉన్నాయి. శనివారం చివరిరోజు.
స్కోరు వివరాలు:
* శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 491 (129.1 ఓవర్లకు)
* బంగ్లా తొలి ఇన్నింగ్స్: 312 (97.2 ఓవర్లకు)
* శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 274/6 డిక్లేర్డ్