
దుబాయ్: 2024 నుంచి 2031 మధ్య జరిగే ప్రధాన ఐసీసీ టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఖరారు అయ్యాయి. మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఆతిథ్యం ఇచ్చే దేశాలను, అక్కడ జరిగే టోర్నీలను వెల్లడించింది. వచ్చే పదేళ్లలో భారత్‌లో 3 ఐసీసీ టోర్నమెంట్లు జరుగనున్నాయి. ముందుగా జూన్ 2024లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌కు తొలిసారి యూఎస్‌ఏ ఆతిథ్యం ఇవ్వనుంది. యూఎస్‌ఏతో పాటు వెస్టిండీస్ ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. 2010లో మెగా టోర్నమెంట్‌ని నిర్వహించిన అనుభవం విండీస్‌కు ఉంది.
2024 టీ20 ప్రపంచకప్ ముగిసిన ఎనిమిది నెలల తర్వాత.. ఫిబ్రవరి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్తాన్‌లో ఆడబోయే మొదటి అతిపెద్ద ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. 1996లో భారత్, శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇచ్చాయి. 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక 2027లో జింబాబ్వే, దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలు మొదటిసారిగా పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే చివరిగా 2003లో ఈ ఈవెంట్‌ను నిర్వహించాయి.
అక్టోబర్ 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 12 నెలల తర్వాత భారత దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 2030లో ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ దేశాల్లో టీ20 ప్రపంచకప్ జరుగనుంది. 1999 తర్వాత ఐర్లాండ్, స్కాట్లాండ్‌లు అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక అక్టోబర్/నవంబర్ 2031లో ప్రపంచకప్ భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో జరగనుంది. మొత్తానికి వచ్చే పదేళ్లలో భారత్ మూడు మేజర్ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 టీ20 ప్రపంచకప్ (శ్రీలంకతో సంయుక్తంగా), 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్‌నకు (బంగ్లాదేశ్‌తో సంయుక్తంగా) భారత్ ఆతిథ్యమివ్వనుంది.