IPL 2023 : ఐపీఎల్ వద్దనుకున్న ఈ ఆటగాళ్లు.. పాకిస్తాన్‌లో హాట్ కేకులు..!

ఐపీఎల్ గొప్పదా? లేక పీఎస్ఎల్ గొప్పదా? అనే వాదన కొంత కాలంగా అభిమానుల మధ్య నడుస్తూనే ఉంది. అయితే పీఎస్ఎల్ ఎంత ప్రయత్నించినా ఐపీఎల్ స్థాయి అందుకోలేదు అనడం అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఎవరూ వద్దనుకున్న ఆటగాళ్లు పీఎస్ఎల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోవడమే దీనికి మంచి ఉదాహరణ. గతేడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు.. పీఎస్ఎల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన వాళ్ల వివరాలు చూస్తే..

ఇమ్రాన్ తాహిర్
వయసు మీద పడుతున్నా తనలో పదును తగ్గలేదని నిరూపిస్తున్న స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. ప్రస్తుతం అతని వయసు 43 సంవత్సరాలు. గతేడాది ఐపీఎల్ వేలంలో తాహిర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
సాధారణంగా సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేసే చెన్నై కూడా అతనిపై ఇంట్రస్ట్ చూపించలేదు. అయితే పీఎస్ఎల్‌లో మాత్రం అతన్ని కరాచీ కింగ్స్ జట్టు ప్లాటినం కేటగిరీలో తీసుకుంది. ఈ జట్టులో షోయబ్ మాలిక్, హైదర్ అలీ, ఇమాద్ వాసిం తదితరులతో కలిసి ఇతను ఆడనున్నాడు.

జోష్ లిటిల్
ఐర్లాండ్ ఎడం చేతి వాటం పేసర్ జోష్ లిటిల్‌ను కూడా గతేడాది ఐపీఎల్‌లో ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే 2023 పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో మాత్రం అతన్ని ప్లాటినం విభాగంలో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు తీసుకుంది. ఇదే విభాగంలో సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్‌ను కూడా ఈ జట్టు తీసుకుంది. ఐపీఎల్‌లో ఎవరూ కొనుగోలు చేయకపోయినా 2022లో చెన్నై జట్టులో జోష్ లిటిల్ నెట్ బౌలర్‌గా సేవలందించాడు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో కూడా రాణించడంతో అతనికి ఐపీఎల్ మినీ వేలంలో మంచి ధర లభించే అవకాశం ఉంది.

జేమ్స్ విన్స్
ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో జేమ్స్ విన్స్ ఒకడు. ఈ ఇంగ్లండ్ ఆటగాడిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎన్నడూ ఇంట్రస్ట్ చూపించలేదు. అయితే పీఎస్ఎల్‌లో మాత్రం అతనికి మంచి డిమాండ్ ఉంది. అందుకే కరాచీ కింగ్స్ జట్టు అతన్ని డైమండ్ కేటగిరీలో తీసుకుంది. అతనితోపాటు జేమ్స్ ఫుల్లర్‌ను కూడా అదే విభాగంలో తమ జట్టులో కలుపుకుంది.

ముజీబ్ ఉర్ రెహ్మాన్
అఫ్ఘానిస్తాన్ లెగ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అంతకుముందు ఐపీఎల్‌లో ఆడాడు. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున ఫర్వాలేదనిపించాడు. అయితే 2022 మెగావేలంలో అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ పీఎస్‌ఎల్‌లో మాత్రం పెషావర్ జల్మీ జట్టు అతన్ని డైమండ్ కేటగిరీలో తీసుకుంది. ఈ జట్టులో బాబర్ ఆజమ్, వాహబ్ రియాజ్ వంటి పాక్ స్టార్లు కూడా ఉండటం గమనార్హం.

రహ్మనుల్లా గుర్బాజ్
ఐపీఎల్‌లో ఎవరూ కొనుగోలు చేయని మరో అఫ్ఘాన్ ప్లేయర్ రహ్మనుల్లా గుర్బాజ్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇంట్రస్ట్ చూపించలేదు. అయితే జేసన్ రాయ్ ఆఖరి క్షణంలో ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో గుజరాత్ టైటాన్స్ జట్టు గుర్బాజ్‌ను తీసుకుంది. కానీ అతను ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో పీఎస్ఎల్ డ్రాప్ట్‌లో అతన్ని ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు ప్లాటినం విభాగంలో తీసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications