
భువి గాయంపై అనుమానాలు..
ఈ నెల 16వ తేదీన మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ గాయపడ్డ విషయం తెలిసిందే. బౌలింగ్ చేస్తోన్న సమయంలో అతని కాలి కండరాలు పట్టేశాయి. దీనితో ఆరు బంతులు కూడా వేయకుండానే భువనేశ్వర్ కుమార్ అర్ధాంతరంగా తప్పుకొన్నాడు. ఇక అప్పటి నుంచి అతను తెరపై కనిపించట్లేదు. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరం అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ గాయం పరిస్థితిపై భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ కూడా లేవు. అయినప్పటికీ- అతను కోలుకుంటాడని, ఈ నెల 30వ తేదీన ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు.

షైనీకి పిలుపు వెనుక ఆంతర్యం?
ఈ లోగా స్టాండ్ బై ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న నవ్‌దీప్ షైనీకి టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి పిలుపు అందింది. దీనితో అతను హుటాహుటిన ఇంగ్లండ్‌కు బయలుదేరి వెళ్లాడు. మాంఛెస్టర్‌లో ఉన్న టీమిండియా జట్టును కలిశాడు. నవ్‌దీప్ షైనీని కేవలం నెట్ బౌటర్‌గా సేవలను అందించడానికి మాత్రమే పిలిపించుకున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. భువనేశ్వర్ కుమార్ అందుబాటులో లేకపోవడం వల్ల నెట్ ప్రాక్టీస్ సమయంలో టీమిండియా బ్యాట్స్‌మెన్లు కాస్త ఇబ్బందులకు గురి అవుతున్నారు. సరైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం వల్ల ఆ విభాగం బలహీన పడినట్లు భావిస్తున్నారు. సరైన టెక్నిక్‌తో బంతులను సంధించే ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉంటే నెట్ ప్రాక్టీస్ సులువుగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు.

నెట్ ప్రాక్టీస్ కోసమేనా?
ఈ నేపథ్యంలో- నవ్‌దీప్ షైనీని టీమిండియా మేనేజ్‌మెంట్ హడావుడిగా ఇంగ్లండ్‌కు పిలిపించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి నవదీప్ షైనీ నెట్ బౌలర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని చెబుతోంది. కాలి కండరాల్లో గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ మిగిలిన అన్ని మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండాల్సి వస్తే.. నవ్‌దీప్ షైనీని ఆడించే అవకాశాలను మాత్రం కొట్టి పారేయట్లేదు. స్పెషలిస్ట్ పేస్ బౌలర్‌గా షైనీని ప్రపంచకప్ మ్యాచుల్లో ఆడించే అవకాశాలు ఉన్నాయని టీమ్ మేనేజ్‌మెంట్ సూచనప్రాయంగా చెబుతోంది. భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని ఇంకా ఏ ఆటగాడితోనూ భర్తీ చేయలేదు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.


Click it and Unblock the Notifications
