T20 World Cup 2026: ఫిబ్రవరి 7, 2026 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ బలమైన జట్టును ప్రకటించింది. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జట్టు ఎంపికలో ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఐపీఎల్ ప్రదర్శనలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ 15 మంది సభ్యుల జట్టులో 7 ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి ఆటగాళ్లకు చోటు దక్కగా.. మూడు ప్రధాన జట్ల నుంచి ఒక్క ఆటగాడు కూడా ఎంపిక కాకపోవడం ఆయా అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
ఐపీఎల్ జట్ల వారీగా ఆటగాళ్ల సంఖ్య
ఈసారి ఎంపికైన జట్టులో ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీకి చెందిన ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది
*ముంబై ఇండియన్స్ (4)- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ
*కోల్‌కతా నైట్ రైడర్స్ (3)- రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
*సన్‌రైజర్స్ హైదరాబాద్ (2)-అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్
*చెన్నై సూపర్ కింగ్స్ (2)- సంజూ శాంసన్, శివం దూబే
*ఢిల్లీ క్యాపిటల్స్ (2) -అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), కుల్దీప్ యాదవ్
*గుజరాత్ టైటాన్స్ (1)- వాషింగ్టన్ సుందర్
*పంజాబ్ కింగ్స్ (1)- అర్ష్‌దీప్ సింగ్

ఆర్సీబీ, రాజస్థాన్, లక్నోలకు నిరాశ
ఈసారి వరల్డ్ కప్ జట్టులో మూడు ఐపీఎల్ జట్ల నుంచి ఒక్క ప్లేయర్ కూడా లేరు. ప్రముఖంగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల నుంచి ఒక్క ఆటగాడు కూడా ఎంపిక కాలేదు. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా.. మరో స్టార్ క్రికెటర్ జితేష్ శర్మకు గట్టి పోటీ కారణంగా చోటు దక్కలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే, స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్, గాయంతో ఇబ్బంది పడటం వారికి పెద్ద దెబ్బగా మారింది. లక్నో జట్టు నుంచి రిషబ్ పంత్ ఖచ్చితంగా ఉంటారని అందరూ భావించినా, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఫామ్ ముందు అతను వెనుకబడక తప్పలేదు.
సంజూ శాంసన్ కొత్త అవతారం.. ఇషాన్ కిషన్ రీఎంట్రీ
ఈ ప్రపంచకప్ జట్టులో అత్యంత ఆసక్తికరమైన అంశం సంజూ శాంసన్. అతను ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడిగా ఉండటం విశేషం. మరోవైపు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఇషాన్ కిషన్ తిరిగి టీ20 జట్టులోకి రావడం గమనార్హం. దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ చూపిన నిలకడ అతనికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కోటాలో బెర్త్‌ను ఖరారు చేసింది.
పేరు కంటే ప్రదర్శనకే పెద్దపీట
బీసీసీఐ ఎంపిక చేసిన ఈ జట్టు సెలక్టర్ల నుంచి ఒక బలమైన సందేశాన్ని పంపింది. సీనియారిటీ లేదా స్టార్ హోదా కంటే ప్రస్తుత స్ట్రైక్ రేట్, మ్యాచ్ విన్నింగ్ ఏబిలిటీనే ముఖ్యం అని తేల్చి చెప్పింది. వైస్ కెప్టెన్సీ నుంచి శుభ్‌మన్ గిల్‌ను తొలగించి అక్షర్ పటేల్‌కు ఆ బాధ్యతలు అప్పగించడం, ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మకు ఓపెనింగ్ బాధ్యతలు ఇవ్వడం భారత జట్టు సరికొత్త దూకుడుతో ముందుకు వెళ్తోందని నిరూపిస్తోంది.