భారత కుర్రాళ్లు అదరగొట్టారు. అండర్19 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో బలమైన ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను రెండు వికెట్ల తేడాతో ఓడించారు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాళ్లు తడబడలేదు. ఒత్తిడిని జయించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. అండర్19 కప్‌లో తుదిపోరుకు చేరడం తొమ్మిదోసారి. అంతేగాక వరుసగా ఇది అయిదో సారి.
మరోవైపు ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఓటమి బాధ తట్టుకోలేక కొంతమంది ఆటగాళ్లు బోరున విలపించారు. స్వదేశంలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌ను సాధించాలని సౌతాఫ్రికా టోర్నీ ఆది నుంచి అద్భుత ప్రదర్శన చేస్తూ వచ్చింది. ఫేవరేట్ జట్టుగా నిలిచింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ మినహా టోర్నీలో దక్షిణాఫ్రికా యువ జట్టు ఓటమి చూడలేదు. కానీ సెమీస్‌లో భారత్ ముందు నిలవలేకపోయింది.

అయితే బాధలో ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ జువాన్ జేమ్స్‌ను టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహరాన్ ఓదార్చాడు. హత్తుకొని ధైర్యం చెప్పాడు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. విజయానందంతో మురిసిపోకుండా ప్రత్యర్థి జట్టు సారథి కోసం ఉదయ్ చేసిన పని గొప్పగా ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా, సెమీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఉదయ్ నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. లూన్ డ్రీ ప్రిటోరియస్(102 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76), రిచర్డ్ సెలెట్జ్‌వేన్(100 బంతుల్లో 4 ఫోర్లతో 2 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లో రాజ్ లింబాని మూడు వికెట్లు తీయగా.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రెండు, నమన్ తివారీ, సామీ పాండే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యం చేధనకు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసి గెలుపొందింది. సచిన్ దాస్(95 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 96) తృటిలో శతకం చేజార్చుకోగా.. ఉదయ్ సహరాన్( 124 బంతుల్లో 6 ఫోర్లతో 81 ) కెప్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ అయిదో వికెట్‌కు 171 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. సౌతాఫ్రికా బౌలర్లలో ట్రిస్టన్ లూస్(3/37), క్వెనా మఫకా (3/32) మూడేసి వికెట్లు తీసారు. బుధవారం ఆస్ట్రేలియా వర్సెస్ పాక్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో విజేతగా నిలిచే జట్టుతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.