న్యూఢిల్లీ: వెస్టిండీ స్టార్ క్రిస్ గేల్ పుత్రికోత్సాహంతో ఉన్నాడు. గురువారం జన్మించిన తన ముద్దుల తనయకు 'బ్లష్' అని పేరు పెట్టినట్లు గేల్ సోషల్ మీడియాలో వెల్లడించాడు.
గేల్ తొలి సంతానాన్ని చూసుకునేందుకు తన ఐపీఎల్ జట్టు బెంగళూరును వీడి జమైకా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే గేల్ తన కుమార్తెకు బ్లష్ అని పేరు పెట్టడం అందరికీ ఆశ్చర్యమే.
బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా ఓ టీవీ ఛానల్‌కు చెందిన మహిళా వ్యాఖ్యాతతో 'డోంట్ బ్లష్ బేబీ' అని అనడంతో గేల్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కూతురుకు అదే పేరు పెట్టడం విశేషం.

ఈ అనుభూతి ఎంతో మధురమైనదని క్రిస్ కామెంట్ చేశాడు. కాగా, గేల్, అతడి సహచరిణి నటాషా కు భారత ఆటగాడు విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. బుల్లి ఏంజిల్ బ్లష్‌తో 'అంకుల్ విరాట్' అని పిలుపించుకోవడం ఎంతో గర్వంగా ఉంటుందని ట్వీట్ చేశాడు.
'ముందు ముందు నీ చిట్టి తల్లితో విరాట్ అంకుల్ అని సంతోషంగా పిలిపించుకుంటా' అని కోహ్లి అన్నాడు. కాగా, 'రెండు గంటల కింద మా పాప బ్లష్ మా జీవితంలోకి వచ్చింది. సంతోషంగా ఉంది. ఎవరైనా కోరుకునే గొప్ప అనుభూతి, బహుమతి ఇది' అని గేల్ గురువారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని పంచుకున్నాడు.