
హైదరాబాద్: భారత జట్టులో ఫిట్‌నెస్ ఎక్కువగా కలిగిన ఉన్న ఆటగాడు ఎవరంటే వెంటనే ఠక్కున చెప్పే పేరు కెప్టెన్ కోహ్లీ. ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ జట్టులోని మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. అంతేకాదు సహచర ఆటగాళ్లు సైతం తనలాగే ఫిట్‌గా ఉండాలంటూ నిత్యం ప్రోత్సహిస్తుంటాడు.
అందుకే ఎప్పుడు యో-యో పరీక్ష పెట్టినా విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరును నమోదు చేస్తుంటాడు. ఇప్పటి వరకు యో-యోలో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 19. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న రికార్డుల ప్రకారం మనీశ్ పాండే మాత్రమే 19.2తో కోహ్లీ కంటే ముందున్నాడు.
అయితే, తాజాగా ఓ యువ క్రికెటర్ యో-యో ఫిట్‌నెస్ టెస్టులో వీరిద్దరినీ వెనక్కినెట్టాడు. అతడి పేరు మయాంక్ డాగర్. ఇంకా అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయలేదు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
కింగ్స్ తరఫున ఎప్పుడూ తుది 11 మందిలో చోటు దక్కలేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఇటీవల నిర్వహించిన యో-యో టెస్టులో మయాంక్ డాగర్ 19.3 స్కోరును అందుకున్నాడు. ప్రస్తుతం అతడు హిమాచల్ ప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు.
21 ఏళ్ల మయాంక్ డాగర్ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు మేనల్లుడు కావడం విశేషం. 2006లో జరిగిన ఐసీసీ అండర్-19 జట్టులో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. గత కొన్నాళ్లుగా టీమిండియాలో ఎంపికయ్యేందుకు బోర్డు యో-యో టెస్టును ప్రామాణికంగా తీసుకున్న సంగతి తెలిసిందే.
యువరాజ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహ్మద్ షమి వంటి ఆటగాళ్లు యో-యో టెస్టును పాస్ అయ్యేందుకు తెగ కష్టపడిన సంగతి తెలిసిందే. అయితే, యువ క్రికెటర్లు మాత్రం ఈ యో-యో టెస్టుని అలవోకగా ఎదుర్కొంటున్నారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన కేరళ యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ యో-యో బెంచ్‌మార్క్ 16.1ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే.
దీంతో అతడు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టులో చోటు కొల్పోయాడు. అయితే, ఇటీవల నిర్వహించిన యో-యో టెస్టులో సంజూ శాంసన్ పాసైన సంగతి తెలిసిందే.