
నాటింగ్‌హామ్: టీమిండియా ప్రతి విజయంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న హార్దిక్ పాండ్యా.. తనకు కూడా ఒక్క అవకాశమొస్తే చాలని ఎదురుచూస్తున్నాడు పాండ్యా సోదరుడు. ఈ మేరకు భారత జట్టు తరపున ప్రపంచకప్ 2019'లో ఆడాలని ఉందని హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుగ్గా ఆడినా కృనాల్.. భారత-ఎ జట్టులోనూ మెరిశాడు.
'నా క్రికెట్ కెరీర్ చాలా గొప్పగా సాగుతోంది. మూడేళ్ల నుంచి ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతూ.. ఈ స్థాయికి చేరుకున్నా. ఇప్పుడు భారత్ -ఎ జట్టులో ఆడుతున్నా.. ఇలానే టోర్నమెంట్లు ఆడుతూ టీమిండియా తరఫున ప్రపంచకప్ 2019లో ఆడాలనేది నా అంతిమ లక్ష్యం. ఆ దిశగానే గత కొంతకాలంగా అడుగులు వేస్తున్నా.. తప్పకుండా నా కలని నెరవేర్చుకుంటా' అని కృనాల్ పాండ్య ధీమా వ్యక్తం చేశాడు.
ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం ఇటీవల ఎంపిక చేసిన భారత జట్టులో అతనికి చోటు లభించలేదు. అయితే.. తన అంతిమ లక్ష్యం భారత్ తరఫున ఆడటమేనని వెల్లడించిన కృనాల్.. ఆ దిశగా ఆటలో మెరుగులు దిద్దుకుంటూ అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ చేసే కృనాల్ పాండ్య ఐపీఎల్ మూడు సీజన్లలో 708 పరుగులు చేసి 28 వికెట్లు పడగొట్టాడు.
మిడిలార్డర్‌లో హిట్టింగ్ చేస్తూ ఒక్కసారిగా జట్టు స్కోరు పెంచడంలో దిట్టగా పేరెన్నికగన్న ఈ ఆల్‌రౌండర్ ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ మ్యాచ్‌లను మలుపు తిప్పే వికెట్లతో సెలక్టర్లను ఆకర్షించాడు. కానీ.. అతను కోరుకున్న టీమిండియాలోకి మాత్రం పిలుపు రాలేదు. మరోవైపు అతని సోదరుడు హార్దిక్ పాండ్యా.. భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించగలిగాడు.