IND vs ENG: ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో జరిగిన ఒక సంఘటన బెన్ స్టోక్స్‌తో సహా ఇరు జట్ల ఆటగాళ్లకు చిరాకు తెప్పించింది. ఇరు జట్ల ఆటగాళ్లు అంపైర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అయితే మ్యాచ్‌ను నిలిపివేయలేదు.
అసలేం జరిగింది?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 4 వికెట్లు కోల్పోయిన ఆ సమయంలో జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నారు. మొదటి రోజు ఆట చివరి దశకు చేరుకున్న సమయంలో హఠాత్తుగా పెద్ద సంఖ్యలు కీటకాలు మైదానంలోకి చొరబడ్డాయి. మైదానం అంతటా అవి గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో ఆటగాళ్లు ఆటపై దృష్టి పెట్టలేకపోయారు.

అప్పుడు ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా తన కళ్ల ముందు ఎగురుతున్న కీటకాలను సరిగ్గా చూడలేక.. వాటిని తన చేత్తో కొట్టడానికి ప్రయత్నించాడు. మరోవైపు బ్యాటింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ వెంటనే బ్యాటింగ్ ఆపి అంపైర్ వద్దకు వెళ్లి తాను మైదానాన్ని సరిగ్గా చూడలేకపోతున్నానని.. చాలా పురుగులు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. అయితే అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఆ కీటకాలు వెళ్లిపోయే వరకు ఆటగాళ్లందరూ ఆటను ఆపి వాటి కోసం వేచి ఉండాల్సి వచ్చింది. దీనివల్ల మ్యాచ్ 5 నుంచి 10 నిమిషాల వరకు నిలిచిపోయింది.
మొదటి రోజు ఆట పరిస్థితి ఇలా..
ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఎప్పుడూ దూకుడుగా ఉండే ఇంగ్లండ్ జట్టు 83 ఓవర్లలో కేవలం 251 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు ఓవర్‌కు 3 పరుగుల చొప్పున మాత్రమే పరుగులు సాధించింది. ఆ జట్టులో జో రూట్ 99 పరుగులతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్‌గా ఉన్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. వారి కంటే ముందు ఓలీ పోప్ 44, బెన్ డకెట్ 23, జాక్ క్రారీ 18, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత జట్టు బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.