
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో మంచి ప్రదర్శనతో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న అతను.. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. అదే సమయంలో అతనితోపాటు బౌలింగ్ చేసిన అర్షదీప్ సింగ్, శివమ్ మావి మరీ ఘోరంగా విఫలమయ్యారు.
ఇలా తన తోటి పేసర్లు ఫెయిలవడంతో శ్రీలంక జట్టు భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు తడబడటంతో చివరకు జట్టు ఓడింది. అయితే కీలక సమయాల్లో ఉమ్రాన్ కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో పరుగులు భారీగా ఇచ్చినా కూడా అతను బాగానే బౌలింగ్ చేశాడని అంతా మెచ్చుకున్నారు. కానీ పాకిస్తాన్ మాజీ సారధి సల్మాన్ బట్ మాత్రం ఉమ్రాన్ బౌలింగ్‌లో పస లేదని విమర్శించాడు.
ఉమ్రాన్ దగ్గర అనుభవం లేదని, దీంతో అతను కొత్త వేరియేషన్స్ కోసం ప్రయత్నించాలని బట్ సూచించాడు. రెండో టీ20లో అతని బౌలింగ్ చాలా సింపుల్‌గా ఉందని, అతను ఎలాంటి బంతి వేస్తాడని ఈజీగా ఊహించేలా అతని బౌలింగ్ సాగిందని చెప్పాడు. అద్భుతమైన పేస్ ఉన్న ఉమ్రాన్.. తన అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలను చేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. ఉమ్రాన్ ఒక్క యార్కర్ కానీ, స్లో డెలివరీ కానీ వేయలేదనే విషయాన్ని ఎత్తిచూపాడు.
'బ్యాటర్లు రూమ్ తీసుకోవడం వంటివి చూసిన తర్వాత ఉమ్రాన్ తన బౌలింగ్‌లో మార్పులు చేసుకోవలసింది. ఆఫ్ స్టంప్ ఆవలగా యార్కర్లు వేయాల్సింది. కానీ ఉమ్రాన్ ఆ పని చేయలేదు. ఇవన్నీ తెలియాలంటే అనుభవం రావాలి. బెంచ్‌పై కూర్చొని ఉంటే ఆ అనుభవం రాదు కదా. కాబట్టి అతన్ని సాధ్యమైనంత ఎక్కువ ఆడించాలి. ఎందుకంటే.. భవిష్యత్తులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లే ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగలుగుతారు' అని బట్ స్పష్టం చేశాడు. మూడో టీ20లో ఉమ్రాన్ ఎలా ఆడతాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.