
హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా విశాఖపట్నం వేదికగా హైదరాబాద్-కర్ణాటక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వివాదాస్పదమైంది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు పరుగులపై వివాదం తలెత్తడంతో హైదరాబాద్ మైదానంలో నిరసనకు దిగింది.
అసలేం జరిగింది?
కర్నాటక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండో ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ మిడ్ వికెట్ వైపు ఆడి రెండు పరుగులు చేశాడు. అయితే బంతిని ఆపే క్రమంలో మెహిదీ హాసన్ కాలు బౌండరీ లైన్ రోప్‌ను తాకినట్టు స్పష్టమైంది. దీనిని ఫీల్డ్ అంపైర్లు గమనించలేదు. దీంతో రెండు పరుగులు మాత్రమే ఇచ్చారు.
ఇన్నింగ్స్ ముగిశాక హైదరాబాద్ 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఆట ఆరంభానికి ముందు కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కర్ణాటక జట్టు స్కోరులో మరో రెండు పరుగులు జత చేసి స్కోరును 205/5గా మార్చారు.
ఈ విషయం హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌కు ఆట మధ్యలో తెలిసింది. దాంతో కెప్టెన్ అంబటి రాయుడు అంపైర్లతో వాదనకు దిగాడు. మరోవైపు వినయ్ కుమార్ కూడా మైదానంలోకి వచ్చి అంపైర్లతో చర్చించాడు. అయితే హైదరాబాద్ వాదనను పట్టించుకోని అంపైర్లు ఆటను కొనసాగించారు.
చివరకు హైదరాబాద్ కూడా సరిగ్గా 203 పరుగులే చేయడంతో ఆ పరుగుల ప్రాధాన్యం పెరిగింది. కర్ణాటకకు రెండు పరుగులు అదనంగా కలపక పోయి ఉంటే మ్యాచ్ టై అయ్యేది. ఆ రెండు పరుగులు కర్ణాటకకు అదనంగా కలిపిన తీరుపై అభ్యంతరం వ్యక్తం జేస్తూ.. సూపర్ ఓవర్ ఆడించమని కోరగా...అంపైర్లు అంగీకరించకుండా కర్ణాటకను విజేతగా ప్రకటించారు.
మ్యాచ్ ముగిశాక కూడా హైదరాబాద్ ఆటగాళ్లు మైదానం వీడకపోవడంతో తర్వాత జరగాల్సిన ఆంధ్ర, కేరళ మ్యాచ్ ఆలస్యమై చివరకు 13 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'నాకు నిబంధనల గురించి బాగా తెలుసు. అప్పుడే అంపైర్లు ఫోర్‌గా ప్రకటిస్తే సమస్య ఉండకపోయేది. మాకు లక్ష్యం నిర్దేశించాక రెండు పరుగులు ఎలా కలుపుతారు. ఒక సారి బ్యాట్స్‌మన్ అవుటై పెవిలియన్ చేరాక అది నాటౌట్‌గా తేలినా, అది నో బాల్ అయినా మళ్లీ వెనక్కి పిలవరు కదా. మొత్తంగా ఏం జరిగిందో తెలియదు. మేమైతే 204 పరుగులు లక్ష్యంగానే బరిలోకి దిగాం. ఇదే విషయాన్ని చెప్పి సూపర్ ఓవర్‌కోసం మేం వేచిచూశాం. కానీ వారు ఆ ఓవర్‌ను ఆడించలేదు' అని రాయుడు తెలిపాడు.
దీనిపై హైదరాబాద్ జట్టు రిఫరీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు హైదరాబాద్-కర్ణాటక జట్ల మధ్య వివాదం తర్వాత 13 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఆరు వికెట్ల తేడాతో కేరళపై ఘన విజయం సాధించింది.
సంక్షిప్తస్కోర్లు:
కర్ణాటక 20 ఓవర్లలో 205/5 (కరుణ్ నాయర్ 77, గౌతమ్ 57, రవికిరణ్ 2/33).
హైదరాబాద్ 20 ఓవర్లలో 203/9 (అగర్వాల్ 38, అక్షత్‌రెడ్డి 70, బీఎస్ సందీప్ 34, బిన్నీ 3/29).
మరోవైపు ఈ ఘటనపై బీసీసీఐ స్పందిస్తూ 'ఈ వివాదం మా దృష్టికి వచ్చింది. మ్యాచ్ రిఫరీ అధికారిక నివేదిక రావాల్సి ఉంది. ఆ తర్వాత బోర్డు క్రమశిక్షణా నియమావళి ప్రకారం తగిన చర్య తీసుకుంటాం' అని ఓ ప్రకటనలో పేర్కొంది.